కాశ్మీర్ కు మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచుతారా?

110
Will assembly seats be increased only for Kashmir?
Will assembly seats be increased only for Kashmir?

జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగానే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు విభజన చట్టం 2014 ప్రకారం వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మంత్రుల నివాసంలో విలేకరులతో వినోద్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను తక్షణం పెంచాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబిచ్చారని ఆయన పేర్కొన్నారు. మరి ఈ సూత్రం జమ్మూ, కాశ్మీర్ ము ఎందుకు వర్తించదని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్ లో రాజకీయ కోణంలో అక్కడ అసెంబ్లీ సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. జమ్మూ, కాశ్మీర్ లో అఖిలపక్ష సమావేశంతో ఈ విషయం తేలిపోయిందని ఆయన తెలిపారు. జమ్మూ,కాశ్మీర్ లో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీ సీట్లు పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు.

ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అని ఆయన అన్నారు. రాజకీయ కుయుక్తులు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు తక్షణమే పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153 కు పెంచాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here