ఢిల్లీ లిక్కర్ స్కాంలో అంతా ఊహించినట్టుగానే జరుగుతోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేశాక.. కల్వకుంట్ల కవితను ఢిల్లీకి పిలిచి అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వాస్తవరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, మార్చి 9న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని ఈడీ కవితకు నోటీసునిచ్చింది. ఆమె ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై ధర్నాకు పిలుపిచ్చిన నేపథ్యంలో.. ఈడీ నోటీసు ప్రాధాన్యతను సంతరించుకున్నది. దీంతో, ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాజకీయ దురుద్ధేశం తోటే కవిత కు నోటుసులిచ్చారని.. ఢిల్లీలో ఆప్ , ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలో భాగమేనని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం లో భాగంగానే ఎంఎల్‌సీ కవితకు ఈడీ నోటీస్ జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఈడీ ద్వారా నోటీస్ ఇప్పించిందని క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఈడీల నోటీసులతో కవిత బెదిరిపోరని.. ఎన్ని వేధింపులకు గురి చేసిన ప్రజా క్షేత్రాన్ని వదలరని ఆయన అన్నారు.
* ఈ క్రమంలో ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ప్రతిఒక్కరి దృష్టిని ఆకర్షించింది. మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా కంటే ముందు రోజు ఈడీ నోటీసును జారీ చేసిందని.. అయినప్పటికీ తెలంగాణ తల వంచదని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాముకు, ఈడీ నోటీసునిస్తే ఇందులో తెలంగాణ తలవంచక పోవడమేమిటని ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఈ లిక్కర్ స్కాంతో ప్రజలకేం సంబంధమని.. రెండు పార్టీల మధ్య నెలకొన్న ఈ వివాదం తెలంగాణ ప్రజలకు ఆపాదించడం కరెక్టు కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదీఏమైనా, మార్చి 9 కవితను ఈడీ అధికారులు విచారించి వదిలేస్తారా? లేక అరెస్టు చేస్తారా? అనేది ఆ రోజే తేలిపోతుంది.