Will Sandra Joins TRS?
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలంగాణ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పక్క పార్టీల గెలిచిన ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను టార్గెట్ చేసిన కేసీఆర్ ప్రస్తుతం ఆ పనిలో బాగా బిజీగా ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే సత్తుపల్లి నుండి గెలిచిన టిడిపి నేత సండ్ర వెంకటవీరయ్య గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారా ? నిన్ను శాసనసభ సమావేశాలకు సైతం గైర్హాజరైన కనీసం టిడిపి నాయకులను సైతం కలవని, ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించని సండ్ర కారు ఎక్కడానికి సిద్ధమైపోయారా? ఎప్పటినుండో ఇవాళ రేపు అంటూ చేరికను వాయిదా వేస్తున్న సండ్ర అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు తాజాగా వంటేరు ప్రతాపరెడ్డి తో పాటు సండ్ర వెంకటవీరయ్య కూడా గులాబీ బాస్ సమక్షంలో పార్టీలో చేరనున్నారా ? అంటే అవును అనే సమాధానం వస్తున్నా జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పలేమని కూడా భావించాల్సి వస్తుంది.
* కాంగ్రెసు నేత వంటేరు ప్రతాప రెడ్డితో పాటు తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య కారెక్కుతారని ప్రచారం సాగుతోంది. శుక్రవారం నాలుగు గంటలకు వంటేరు ప్రతాప రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమక్షంలో గులాబీ కుండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారని అంటున్నారు.
* సత్తుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున పోటీ చేసి గెలిచిన సండ్ర టీఆర్ఎస్ లో చేరుతారని గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి హామీ కూడా సండ్ర వెంకటవీరయ్య ఇచ్చినట్లుగా ప్రచారమైంది. ఈ నేపథ్యంలో సండ్ర సైతం టీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఇక దానికి ఊత మిస్తూ ఆయన టిడిపికి దూరంగా ఉంటున్నారు. ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి కూడా ఆయన రాలేదు. దీంతో సండ్ర సైకిల్ దిగడం ఖాయమని భావిస్తున్నారు. సండ్ర టీఆర్ఎస్ చేరడం ఖాయమని ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు సత్తుపల్లి వెళ్లి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సండ్రతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావును కూడా పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి సండ్రా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తున్నా ఆయన పార్టీలో చేరకుండా చేస్తున్న తాత్సారం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అని చర్చ జరుగుతోంది. ఈ రోజు సండ్ర పార్టీలో చేరుతున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి చూడాలి సండ్ర టిఆర్ఎస్ పార్టీలో చేరుతారో లేదో.