Woman attempts suicide by jumping into Krishna river
ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. ఆజాగా ఓ వివాహిత కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. బాబును వదిలేసి నదిలోకి దూకిన మహిళను చూసిన పోలీసులు అప్రమత్తమై గజ ఈతగాళ్ల సాయంతో ఆమెను ప్రాణాలతో కాపాడారు.
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. అనంతరం తన కుమారుడిని అక్కడే వదిలేసి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఈతగాళ్ల సాయంతో మహిళను రక్షించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమెను స్వస్థలానికి తీసుకెళ్లారు. ఏది ఏమైనా కారణాలు ఏవైనా ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది కానీ చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడటం మాత్రం నిజంగా హేయం .