Saturday, October 5, 2024

చేతబడి సాకుతో మహిళ సజీవ దహనం!

ప్రపంచమంతా ఓవైపు సాంకేతిక పరిజ్ఞానంతో భూమి నుంచి ఆకాశానికి పరుగులు పెడుతుంటే.. కొందరేమో ఇంకా మూఢ నమ్మకాల పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. చేతబడులంటూ అనుమానం ఉన్నవారిపై దాడులు చేస్తున్నారు. మరికొందరేమో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా అలాంటి ఓ కారణంతో చేతబడి చేస్తుందన్న సాకుతో ఓ మహిళపై అతి దారుణంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

పెట్రోల్ పోసి సజీవ దహనం
మెదక్ జిల్లా రామాయం పేట మండలం కాట్రియాల గ్రామంలో డేగల ముత్తవ్వ(45) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆమె చేతబడి చేయడంతోనే తరచూ అనారోగ్యానికి గురవుతున్నామనే అనుమానంతో గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. గురువారం రాత్రి ఇంట్లో ఉన్న ముత్తవ్వను దారుణంగా కొట్టారు. ఆపై పెట్రోల్ పోసి నిపంటించారు. దీంతో ఆమె అరుపులు విన్న కొందరు వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వెంటనే రామాయంపేట హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముత్తవ్వ శుక్రవారం మరణించింది. దీంతో మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఆధునిక కాలంలో మంత్రాల పేరుతో ఓ మహిళను సజీవ దహనం చేయడం అత్యంత దారుణమైన విషయమని అన్నారు.

ఇలాంటి ఒక సంఘటనతో సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు. ప్రజలెవరూ ఇలాంటి మూఢనమ్మకాలని, మంత్రాలను నమ్మవద్దని సూచించారు. దీనిపై పోలీసులు ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని అన్నారు. ఇకనైనా ప్రజలు మారాలని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular