క్షణికావేశంతో ఆ మహిళా న్యాయవాది తన నిండు ప్రాణాలను తీసుకుంది. తన ఆఫీసు నుంచి స్టాంప్ పేపర్లను మేనమామ దొంగిలిచాడని అప్పటికే ఆవేదనతో ఉన్న ఆమె, ఓ వేడుకలో భర్త ప్రవర్తనతో తీవ్ర నిస్పృహకులోనైంది. అప్తులు చూస్తుండగానే మూడంతస్తుల భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చందానగర్లో ఈ ఘటన జరిగింది. మర్నాడు కుమారుడి బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్న ఆమె ఇలా తన ప్రాణాలను తీసుకోవడం స్థానికులను కలిచివేసింది. శేరిలింగంపల్లి లక్ష్మీ విహార్ ఫేజ్-1 డిఫెన్స్ కాలనీకి చెందిన హేమకు శ్రీవాణి , వర్షిత కుమార్తెలు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. శ్రీవాణి న్యాయవాద విద్యను పూర్తిచేసింది. ఐదేళ్ల క్రితం మల్లికార్జున రెడ్డిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. మల్లికార్జున్ సినిమాల్లో జూనియర్ ఆర్టి్స్టగా చేసేవాడు. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. శ్రీవాణి, నల్లగండ్ల ప్లైఓవర్ సమీపంలో స్టాంప్స్ అండ్ వెండర్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. మార్చి 27న ఆమె ఆఫీసు నుంచి మేనమామ రఘు స్టాంప్ పేపర్లను దొంగిలించాడు.
తిరిగిచ్చేయాలంటూ శ్రీవాణి ఎన్నోసార్లు ఆయన్ను అడిగినా ఇవ్వలేదు. శ్రీవాణి చెల్లెలు వర్షిత అదే కాలనీలో నివాసం ఉంటుంది.వర్షిత ఇంట్లో ఒడిబియ్యం వండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు రావాలంటూ శ్రీవాణికి వర్షిత ఫోన్ చేస్తే, తాను రాలేనని చెప్పింది. కాగా వర్షిత ఇంట్లో వంటల కార్యక్రమం సందర్భంగా శ్రీవాణి భర్త మల్లికార్జున్.. స్టాంప్ పేపర్లు ఇప్పించాలంటూ రఘు భార్య లక్ష్మిని అడిగాడు. ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. అప్పుడే స్టాంప్ పేపర్ల గురించి మాట్లాడదాం రమ్మంటూ భార్య శ్రీవాణికి మల్లికార్జున్ ఫోన్ చేశాడు. వేడుక సందర్భంగా గొడవ పడటం సముచితం కాదని, బాబు పుట్టిన రోజు వేడుక అయ్యాక మాట్లాడదామని ఆమె సమాధానమిచ్చింది. వినిపించుకోని మల్లికార్జున్ ఇంటికి వెళ్లి ఆమెను అక్కడికి తీసుకొచ్చాడు. వర్షిత, మల్లికార్జున్, రఘు, లక్ష్మి అంతా కలిసి భవనం మూడో అంతస్తులోని బాల్కనీలో నిల్చుని స్టాంప్ పేపర్ల విషయంలో గొడవ పడుతుండగానే శ్రీవాణి బాల్కనీలోంచి కిందికి దూకేసింది. ఆమెను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. కుమార్తె ఆత్మహత్యకు తన తుమ్మడు రఘు, అల్లుడు మల్లికార్జున్ కారణం అని హేమ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.