Work With Heart Said Minister Satyavathi Rathod
వెనుకబడిన గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయడంలో మనుసు పెట్టి పనిచేస్తే చాలా సమస్యలు పరిష్కరం అవుతాయని గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. గౌరవ సభ్యులు, అధికారుల సహకారం లేకుండా ఏమి చేయలేనని, ఈ శాఖను సమర్ధవంతంగా నిర్వహించడంలో అందరూ సహకరించాలని కోరారు. గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ శాఖలపై అవగాహన పెంచుకునే నేపథ్యంలో,అధికారులు, నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ డిపార్ట్ మెంట్ సమీక్షలు పాటు గిరిజన ఎమ్మెల్యేలు, అధికారులతో అసెంబ్లీలో సమీక్షా సమావేశం జరిపారు. గౌరవ సభ్యుల సమస్యలన్నీ పరిష్కారం అయినప్పుడే మనమంతా విజయం పొందినట్లు అన్నారు. మనకున్న సమస్యలు, మనకున్న బడ్జెట్ ఏమిటనే దానిపై అధ్యయనం చేసుకుని ముందుకెళ్దామన్నారు. ఐటీడీఏలు గిరిజన కష్టాలు తీర్చే నిలయాలుగా ఉండేవి. కానీ రోజురోజుకు ఆ పేరును కోల్పోతున్నాయని, తిరిగి వీటికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. కొన్ని డబ్బులతో పరిష్కారం అవుతాయి. మరికొన్ని మనం స్పందిస్తే చాలు పరిష్కారం అవుతాయన్నారు. త్వరలోనే ట్రైబల్ అడ్వయిజరీ మీటింగ్ పెట్టుకుందామని, సమస్యలన్నీ చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పారు.
విద్యకు ప్రాధాన్యతనివ్వాలి..
గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ… అటవీ భూ పరిరక్షణ చట్టం కింద ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించి, గిరిజనులకు పట్టాలివ్వాలని అడిగారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యాలయాల్లో మౌలిక వసతులు మరిన్ని కల్పించాలని కోరారు. కిరాయి భవనాల్లోని విద్యాలయాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం నిధులు సాధించుకోవాలని సూచించారు. సిఆర్టీలు, కాంట్రాక్టు టీచర్ల సమస్యలపై దృష్టిసారించి వాటిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఐటీడీఏలలో పూర్తి స్థాయి అధికారులను నియమించాలని, ఐటీడీఏలకు పూర్తిస్థాయి అంబులెన్సులను ఏర్పాటుచేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏ.ఎన్.ఎంలను నియమించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని, చివరి గిరిజనుడికి కూడా అందేలా వాటిని అమలు చేయాలన్నారు. ప్రతి రైతుకు వ్యవసాయానికి అనుగుణంగా నీటి సదుపాయం కల్పించాలని,బోర్ వెల్స్, బావుల వసతి కల్పించాలని కోరారు. ఆర్ధిక ప్రోత్సాహక పథకం కింద ఇచ్చే ట్రాక్టర్లకు లైసెన్స్ నిబంధనలు తొలగించాలన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, చీఫ్ ఇంజనీర్ శంకర్ రావు, గురుకులాల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.