తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం పత్రిపక్షాలకు లేఖ రాస్తూ.. ఇందుకోసం అఖిలపక్షంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, రాళ్ల దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఆమె బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండరాం, కాసాని జ్జానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసదుద్దిన్ ఓవైసీ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఎన్ శంకర్ గౌడ్, మందకృష్ణ మాదిగ తదితరులకు లేఖ రాశారు. లేఖలో ఆమె ఏమని రాశారంటే..
తెలంగాణ సమాజం ఈ రోజున దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అప్రకటిత అత్యయిక పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. నోరు విప్పితే కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు మరియు దారుణ హింసకు దిగుతున్నారు. ఈ లేఖ ద్వారా, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను మీతో చర్చించాలనుకుంటున్నాను. అధికారపక్ష దాష్టీకాలకు ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని విపక్ష నేతలకు వినమ్రంగా విన్నవించుకుంటున్నా. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల కోసం కేసీఆర్ సర్కారు నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు పాలనలోని వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకూ దిగజార్చుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో అవినీతికి పాల్పడిన వైనం ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రాజెక్టుల పేరుతో, రీడిజైనింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను దోచేస్తున్న కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసులు మోపుతున్నారు. రాక్షసత్వంతో పోలీసుల్ని ఉసిగొల్పి, వారిపై ఒత్తిడి తెచ్చి మరీ థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ ఆసుపత్రిపాలు చేస్తున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజున నోరు తెరవటానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలకు సైతం అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రజలకు వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డుకుంటున్నారు. పాదయాత్రలు చేసే వారిపై అధికారమదంతో దాడులు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీ కార్యకర్తల పేరుతో గూండాలను తయారు చేస్తూ, విపక్షాలు చేసే కార్యక్రమాలపై దాడులకు పురిగొల్పుతున్నారు. బీఆర్ఎస్ సర్కారు చేసే తప్పుల్ని వేలెత్తి చూపేవారిని హత్యలు చేసేందుకు, వేధింపులకు గురి చేయటానికి కూడా వెనుకాడని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. వయసులో పెద్దవారన్న తేడా లేకుండా నోటికి వచ్చినట్లుగా బూతులు తిడుతూ, మహిళలన్న గౌరవం లేకుండా అవమానిస్తున్న వైఖరిని ఖండించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ నియంత పాలనతో రాజ్యాంగం కల్పించిన భావస్వేచ్ఛకు సైతం చెర పట్టించిన పరిస్థితి.
* తెలంగాణలో సహజసిద్ధంగా ఉండే సోదరభావం, ప్రజల మధ్య సామరస్యం, ఐక్యత, ఇవి ఏమీ లేకుండా చేస్తున్న విధానాలను మూకుమ్మడిగా ఖండించాల్సింది. ఈ మధ్యనే ఒక యువనాయకుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి ఆందోళన చేయటమే అతని పాలిట పాపమైంది. అతన్ని దారుణంగా గాయపరిచి, రక్తపు మడుగులో పడేసి, తమకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అన్న హెచ్చరిక తెలంగాణ సమాజానికి కేసీఆర్ సర్కారు చేసింది. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. మనం సభ్యసమాజంలో ఉన్నామా, లేదా అన్న సందేహం కలిగేలా చేస్తోంది. ఒక మహిళగా గడిచిన రెండేళ్లుగా నన్ను అంటున్న మాటలు, చేస్తున్న హేళనలను, హెచ్చరికలను నేను లెక్క చేయకుండా ప్రజలకోసం ముందుకు సాగిపోతున్నానన్న కోపంతో నన్ను, నా వాళ్లను తగలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు మీకు తెలిసినవే. ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న నన్ను కారులో ఉండగానే టోయింగ్ చేసిన దారుణం ఆంధ్రా పాలకుల హయాంలోనూ చోటు చేసు కోలేదు. ప్రజా సమస్యల మీద పోరాడే వారి పట్ల వీరి వేధింపులేంది? కేసీఆర్ రాక్షసపాలనకు వ్యతిరేకంగా పోరాడినా. వారి వేల కోట్ల అవినీతిపై గళం విప్పినా తీవ్రంగా స్పందిస్తూ, సంబంధం లేని సెక్షన్లతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. జైళ్ల పాలు చేస్తున్నారు. ఇదెక్కడి ఆరాచకం?వలస పాలకుల పోకడలకు ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల త్యాగాల్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల మీద ఉంది. అందుకు జెండాలను పక్కన పెట్టి, ఒక్కటై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
* తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మనమంతా ఏకమై, ఒక గళంగా మారాలి. మన పోరు కేక నియంత కేసీఆర్ పాలనకు చరమగీతంలా మారాలి. ఈ నీతిమాలిన సర్కారును బర్తరఫ్ చేయాల్సిన చారిత్రక అవసరాన్ని ఇప్పటికే గౌరవనీయులు తెలంగాణ గవర్నర్ గారిని కలిసి నివేదించటం జరిగింది. మలి అడుగుగా, ఢిల్లీలో గౌరవ రాష్ట్రపతిగారిని కలిసి కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాల్సిన అవసరాన్ని తెలియజేయాల్సిన పరిస్థితి. ఈ అత్యవసర పరిస్థితిని గుర్తించి, అందరం కలిసి గౌరవ రాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో నెలకొన్న అరాచకపాలన గురించి విన్నవించాలి. అందుకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు.