బీసీలంటే భారత్ కల్చర్

YSRCP BC DECLARATION

  • ఏలూరు బీసీ గర్జనలో వైఎస్ జగన్ వ్యాఖ్య
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో 50 శాతం బలహీన వర్గాలకే…
  • బీసీల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.75వేల కోట్లు కేటాయింపు
  • బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వైఎస్సార్ సీపీ అధినేత

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని, బీసీలంటే భారతీయ కల్చర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలు మన జాతికి వెన్నెముకలని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం జరిగిన బీసీ గర్జన మహాసభలో ఆయన ప్రసంగించారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని స్పష్టంచేశారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన బీసీ డిక్లరేషన్ ను ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో రూ. 15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 75వేల కోట్లు ఇస్తామని స్పష్టంచేశారు. బీసీలకు ప్రతి ఏడాది రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. గత ఐదేళ్లలో రూ. 60వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు.  తాము అధికారంలోకి వస్తే బీస్ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని, దీనికి సంబంధించి తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్ చేయూత కింద రూ. 75 వేలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామని ప్రకటించారు. పిల్లల చదువుకు ఎంతైనా ఖర్చుపెడతానని, ఎన్ని లక్షలైనా వారిని ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. హాస్టల్లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20వేలు ఇస్తామని, పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తామని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో 50శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేసి.. రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. షాపులున్న ప్రతి నాయి బ్రాహ్మణులకు ఉచితంగా ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10వేలు ఇస్తామని.. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ. 10 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం అందజేస్తామన్నారు. పేదవాడు ప్రమాదవశాత్తు చనిపోతే వైఎస్సార్ చేయూత కింద రూ.7లక్షలు అందజేస్తామన్నారు. మొత్తమ్మీద బీసీలను ఆకట్టుకునే దిశగా పలు హామీలు ఇచ్చిన జగన్.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టంచేశారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article