YSRCP cheated Amaravati farmers Says Pawan Kalyan
ఏపీ సర్కార్ రైతులను నిలువునా ముంచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ధాన్యం అమ్ముకొని వారాలు గడుస్తున్నా…ఇప్పటికీ సొమ్ములు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, భరోసా అంటూ ఎన్నికల సమయంలో వాద్దానాలు చేశారు ..పాలనలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడం లేదన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.2,016 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలిపారు. లక్ష మందికిపైగా రైతులు రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని పవన్ పేర్కొన్నారు. రెండో పంట పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సొమ్ములు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఖరీఫ్ పంట కొనుగోలు, సొమ్ము చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. డిసెంబర్ నెలలోనే రైతు సౌభాగ్య దీక్ష ద్వారా తాము వెల్లడించామని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా? ..కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి? అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.