వైకాపా ఎల‌క్ష‌న్ హీట్‌

YSRCP ELECTION HEAT IN ANDHRA PRADESH
ఏపీలో చంద్రబాబు ను గద్దె దించటమే కోసం వైసిపి విఫల యత్నాలు చేస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పటికే తటస్థులను ఆకర్షించేందుకు అన్న పిలుపు కార్యక్రమంతో లేఖలు రాస్తున్న వైసీపీ తాజాగా బూత్ లెవెలో కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు సమర శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ప్రజాక్షేత్రంలో పట్టు సాధించడం కోసం, ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం కోసం, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం వైసిపి శంఖారావం కార్యక్రమంతో ముందుకు వెళ్లనుంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఈ సమర శంఖారావం కార్యక్రమం చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4న తిరుపతిలో సమర శంఖారావం కార్యక్రమానికి అంకురార్పణ జరగబోతుందన్నారు. తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం పూరించనుందని చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సమాయత్తం చేసేందుకు బూత్‌ కన్వీనర్లు, కమిటీల సభ్యులకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 4న చిత్తూరు, 5న కడప, 6న అనంతపురం జిల్లాల్లో సభలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల మధ్య ఉన్న జగన్ నిత్యం ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. సమర శంఖారావం పేరుతో నిర్వహించే జిల్లా స్థాయి సమావేశాల్లో బూత్‌ కన్వీనర్లు, కమిటీల సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  మొత్తం మీద రానున్న ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం పేరుతో ఇప్పటి నుండే జనాల్లోకి వెళ్లనుంది. మొన్నటి వరకు పాదయాత్ర నిర్వహించిన జగన్ పాదయాత్ర వల్ల వచ్చిన మైలేజ్ తో పాటుగా సమర శంఖారావం తోనూ ప్రజల్లో వైసిపి మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article