వైసీపీ లో చేరకున్నా చక్రం తిప్పుతున్న నేత

YSRCP LO JOIN AYE CHAKRAM TIPUTUNA NETHA … ఎవరంటే

దగ్గుబాటి ఆశించిన పర్చూరు నియోజకవర్గం టికెట్ పై జగన్ హామీ ఇచ్చారో లేదో తెలియదు కానీ వైసీపీ తీర్థం పుచ్చుకోకుండానే చక్రం తిప్పుతున్నారని టాక్.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ఎమ్మెల్యే, మరో పారిశ్రామిక వేత్త వైసీపీలో చేరడం వెనుక తెరవెనుక మంత్రాంగం నడిపింది దగ్గుబాటి వెంకటేశ్వరరావేనని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు పెద్దల్లుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే తెలియని వారు ఉండరు.
ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉంటూ రాజకీయ వ్యూహాలు రచించేవారు. తెరవెనుక ఉంటూ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పాలనకు సూచనలు సలహాలు ఇస్తుండేవారు. అటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
ఎన్టీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన భార్య దగ్గుబాటి పురంధీశ్వరి కూడా రాజకీయ ఉద్దండురాలే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వీడిన తర్వాత భార్య పురంధీశ్వరితో కలిసి 2004లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలుపొందగా పురంధీశ్వరి బాపట్ల ఎంపీగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ పర్చూరు ఎమ్మెల్యేగా మరోసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలుపొందగా..పురంధీశ్వరి విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు. ఆమె కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. తనయుడు రాజకీయ భవిష్యత్ దృష్ట్యా రాజకీయాలవైపు చూస్తున్నారు. తనయుడు హితేష్ చెంచురాం ను పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు. అయితే పర్చూరు టికెట్ విషయంపై జగన్ క్లారిటీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. ఇకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తనయుడు హితేష్ చెంచురాం వైఎస్ జగన్ తో భేటీ కాకముందే ఇద్దరు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను కలిశారు. డిసెంబర్ 24న కారంచేడులో ఆమంచి కృష్ణమోహన్ ను దగ్గుబాటి కలిశారు. రాజకీయాలపై చర్చించారు.
వాస్తవానికి ఆమంచికి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్నేహం ఉంది. అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి బంధుగణం పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో వారి మద్దతు కోరేందుకు ఆమంచిని కలిశారంటూ వార్తలు కూడా వచ్చాయి.
అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తనయుడు హితేష్ చెంచురాంతో వైఎస్ జగన్ ను భేటీకావడం, వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించడం కూడా చకచకా జరిగిపోయాయి. వారు కలిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా వైఎస్ జగన్ ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఆమంచి వైఎస్ జగన్ ను కలవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యూహమే కారణమని తెలుస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న దాసరి జైరమేష్ వైసీపీలో చేరాలనుకోవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయిన సందర్భంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిత్వంపై చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు చెయ్యలేదని జగన్ స్పష్టం చేశారట.
అంతేకాదు ఆర్థికంగా స్థితిమంతుడు, విజయవాడలో కేశినేని నాని లాంటి వ్యక్తిని ఢీకొట్టగల బలమైన అభ్యర్థి కావాలని చెప్పడంతో తన సన్నిహితుడు అయిన దాసరి జైరమేష్ పేరు తెరపైకి తెచ్చారట దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
దీంతో శుక్రవారం సాయంత్రం దాసరి జై రమేష్ ని వెంటబెట్టుకుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిశారు. చర్చల అనంతరం జైరమేష్ వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ముహూర్తం చూసుకుని పార్టీ కండువాకప్పుకుంటానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు టార్గెట్ గా వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్న తరుణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా జగన్ బాటలో పయనిస్తూ కీలక నేతలను వైసీపీలోకి తీసుకురావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఇకపోతే మరింతమంది సీనియర్ నేతలను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తోంది. ఇకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు, ఆమంచి కృష్ణమోహన్, జై రమేశ్ ముగ్గురు నేతలు మంచి ముహూర్తం చూసుకుని చేరుతామని ప్రకటించారు. అంతేకానీ వెంటనే పార్టీ కండువా కప్పుకోలేదు. ఈ ముహూర్తం వెనుక ఏమైనా రహస్యం దాగి ఉందా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. సో ఏం జరుగుతుందో ఏమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article