టీటీడీ చైర్మన్ గా ప్రమాణం చేసిన వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy as TTD Chairman

టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రేపటి నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. టీటీడీ నూతన చైర్మన్‌గా వైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గరుడ ఆళ్వార్‌ సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డితో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రమాణం చేయించారు.

తిరుమలలో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామన్నారు. అర్చకుల సమస్యపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో లానే మఠాధిపతులు, పీఠాధిపతుల సదస్సు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి ఆభరణాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. స్వామివారి నిధులు, నగలు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

టీటీడీ అభివృద్ధికి కృషి చేస్తామని, గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తులకు సేవ చేసే భాగ్యం తనకు కల్పించినందుకు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వసతుల కల్పన, సామాన్య భక్తుని నుంచి ప్రతి ఒక్కరికి దర్శనం, ఉద్యోగులకు భద్రత వంటి అంశాలపై ఫోకస్ చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీకి వచ్చే డబ్బు స్వామివారికే దక్కాలని, అక్కడ నుంచి అవి పేద ప్రజలకు చేరాలని, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా చూసే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.

హిందూ ధర్మ ప్రచారాన్ని కాపాడుకుంటూ టీటీడీ అభివృద్ధికి కృషి చేయాలని సీఎం జగన్ తనకు ఆదేశం ఇచ్చినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. త్వరలోనే పాలకమండలి సభ్యుల నియామకాలు కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ 50వ చైర్మన్‌. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article