కాళేశ్వరంలో ఫస్ట్ వికెట్..?
మాజీ మంత్రి హరీశ్‌రావుకు పిలపు
ఈసారి విచారణకు హాజరు..?
ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు
హైదరాబాద్‌లో ఒక బృందం..
ఢిల్లీలో మరో బృందం వివరాల సేకరణ
వివరణ ఇచ్చేందుకు రెడీ అవుతున్న మాజీ మంత్రి
ఈ నెల 20 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ
ఇప్పటికే హరీశ్‌కు నోటీసులు..?
నిన్నటిదాకా మేకపోతు గాంభీర్యంలో ఉన్న బీఆర్ ఎస్‌కు ఇప్పుడు భయం పట్టుకున్నది. కాళేశ్వరం కమిషన్ విచారణలో బీఆర్ఎస్ అగ్రనేత, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు అందినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ హయంలో ఆయనే మంత్రిగా కొసాగిన నేపథ్యంలో కాళేశ్వరం ఉచ్చు బిగిస్తున్నట్లుగానే పరిస్థితి మారింది. బీఆర్ఎస్ లో అరెస్టు అయ్యే అగ్రనేతల్లో ముందుగా హరీశ్ రావు పేరే రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో కాళేశ్వరంలో కీలక వికెట్ హరీశ్ రావు అని స్పష్టమవుతున్నది. రెండు రోజుల నుంచి హరీశ్‌రావు ఇంటిలో న్యాయ నిపుణులు మకాం వేయగా.. మరో లీగల్ టీం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లింది. కాళేశ్వరం పత్రాలు, అప్పుడు జరిగిన ఒప్పందాలు అన్నింటిపైనా అఫిడవిట్లు రెడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తుందో అని గులాబీ శ్రేణులు భయంతో ఆందోళనలో ఉన్నారు.
విచారణకు రెడీ
కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ఈ నెల 20 నుంచి మొదలు కానున్నది. ఈసారి ఐఏఎస్ అధికారులతో పాటుగా హరీశ్‌రావును పిలువనున్నారు. దీనిపై ఇప్పటికే నోటీసులు అందినట్లు కూడా తెలుస్తున్నది. అందుకే కమిషన్ ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వంలో కేసీఆర్ సీఎం అయితే హరీష్ రావు జలవనరుల మంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్లు చేస్తే… వాటిని హరీష్ రావు పక్కాగా అమలు చేశారు. కాళేశ్వరం అప్పులు, రీ డిజైన్లు అన్నీ ఇలా ఇద్దరి కనుసన్నల్లోనే జరిగాయి. ఇక సంబంధిత ఉన్నతాధికారులు జీ హూజూర్ అని.. ఎక్కడ సంతకాలు పెట్టాలంటే అక్కడ పెట్టేశారు. ఈ పరిణామమే ఇప్పుడు కేసీఆర్,. హరీశ్ రావుతో పాటు అధికారుల కు తిప్పలు తప్ప ని పరిస్థితి నెలకొంది.
వరుసగా ఇవే
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓవైపు కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండగా..ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా చివరి దశకు చేరుకుంది. పొలిటికల్ బాంబుల్లో ఇది రెండోదిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్, త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. దాని ఆధారంగా కేసులు, అరెస్టులు జరిగే చాన్స్ ఉంది. విచారణలో మాజీ ఈఎన్‌సీలు, ఇంజినీర్లు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే ప్రాజెక్టులో కుట్రపూరిత చర్యలు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు, కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను లక్ష కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇంకో పాతిక వేల కోట్లకు ప్లాన్ చేశారు. అప్పు చేసి మరీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్నారు. ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే, ముందుచూపుతో ఏళ్ల తరబడి ఉండేలా కడతారు. లక్షల కోట్ల ప్రాజెక్ట్ అంటే ఓ శతాబ్ద కాలం ఉపయోగపడాలి. ఎప్పుడంటే అప్పుడు కరువు తీరి కడుపు నింపాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతేనని ఎన్నో గొప్పలు చెప్పారు. కానీ, కొన్నేళ్లకే దీని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 7 లింకులుగా, 28 ప్యాకేజీలుగా మార్చి దీని నిర్మాణం మొదలుపెట్టారు. గోదావరికి వంద మీటర్ల ఎత్తులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. కానీ, కొన్నేళ్లతో ఇందులోని లోపాలు బయటపడ్డాయి. చివరకు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయి, ప్రస్తుతానికి నీటి నిల్వ ఆగిపోయింది. ప్రాజెక్టు పనుల్లో అధిక భాగం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ చేసింది. ఈపీసీ పద్దతిలోనే పనులు కొనసాగాయి. అయితే, ప్రాజెక్ట్ పనుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర జలసంఘం డీపీఆర్‌లో ఆమోదించిన ఖర్చుకి అంచానాలకు తేడా అక్షరాలా రూ.67 వేల 406 కోట్లు. దీన్నిబట్టే ఎంతగా దోపిడీ జరిగిందో తెలుస్తోంది. వాస్తవానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ మొదలైంది. వ్యాప్కోస్ తయారు చేసిన డీపీఆర్‌లో రూ.81,911 కోట్ల ఖర్చుతో పూర్తి అవుతుందని అంచనా వేశారు. కానీ, లక్ష కోట్లకు పైనే ఖర్చు చేశారు. సివిల్ వర్క్స్‌లోనే రూ.43వేల కోట్లు పెంచారు. కాంట్రాక్ట్ కంపెనీలు ఎత్తిపోతల కోసం మోటార్లను, పంపులను కొనుగోలు చేసిన సమయంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నారు. ఆ దిశగా కమిషన్ సైతం విచారణ కొనసాగించింది. కాగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు భారీగా అంచనాలను పెంచుకుని టెండర్స్, నామినేషన్‌తో దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ మేఘా 30శాతం కమీషన్స్‌తో సబ్ కాంట్రాక్టులు ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ప్రధాన కాంట్రాక్టర్ కు చేరేలా, జీఎస్టీలు ఎగవేయడం, ఇన్పుట్ సబ్సిడీ తెచ్చుకునేలా బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ సొమ్మును క్యాచ్ రూపంలో మార్చడం జరిగింది. ఇలా రూ.70వేల కోట్ల నగదును మార్చి రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగవేశారని 2021లో జీఎస్టీ హైదరాబాద్ బ్రాంచ్‌లో రిపోర్టు ఉంది. ఈ రిపోర్టు దాచిపెట్టేందుకు, తారుమారు చేసేందుకు లంచాలు ఇచ్చారని అనుమనాలు ఉన్నాయి.
అధికారులదీ కీలక పాత్ర
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఆనాటి ఈఎన్సీల పాత్ర చాలా మోసపూరితంగా కనిపిస్తుంది. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌గా ఉంటూ మేఘా సంస్థ నుంచి డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్స్ కి మేలు చేశారు. దానికి ప్రతిఫలంగా వందల కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకున్నారు. కొందరు రిటైర్డ్ అధికారులను తమ సంస్థలో చేర్చుకుని, లాబీయింగ్‌లకు కూడా పాల్పడింది మేఘా సంస్థ. అధికారులను ఇష్టం వచ్చినట్టు వాడుకుంది. అప్పటి ప్రభుత్వ అండదండలతోనే ఇదంతా సాగిందనే అనుమానాలున్నాయి. మేఘా సంస్థ భారీగా అవినీతికి పాల్పడి, గులాబీ నేతలకు కమీషన్లు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
కమిషన్ నివేదిక తర్వాత ఏం జరగబోతోంది?
వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ కుప్పకూలింది. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచే పరిస్థితి లేదు. ఇతర బ్యారేజీల్లోనూ లోపాలు బటయపడ్డాయి. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు, అంచనాలు పెంచడం వెనుక జరిగిన వ్యవహారాలను బయట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులను ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా కీలక సమాచారం రాబట్టిన కమిషన్, త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. కొందరు అధికారులు, కాళేశ్వరం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పారు. హరీష్ రావు పాత్రపైనా కీలక సమాచారం అందించారు. ఇక కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి కేటీఆర్‌కు ఉన్న లింకులపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. నిజానిజాలన్నీ బయటకొస్తే, డిసాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసులుంటాయి. నిర్లక్ష్యం, కుట్రపూరితం అంటూ క్రమినల్ కేసులకు ఛాన్స్ ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు తప్పవు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ బాంబుల ప్రస్తావన పలుమార్లు తెచ్చారని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ వేట మొదలైనట్లేనని తెలుస్తోంది.