* డీపీఆర్ ప్రకారం కాపర్‌డ్యామ్ కు డబ్బులు
* పనులను నామినేషన్ పద్ధతిన వ్యాప్కోస్‌కు అప్పగించాం
* కాళేశ్వరం కమిషన్ విచారణలో సీఈ సుధాకర్ రెడ్డి
* వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే దెబ్బతిన్న బ్లాకులు
* కాళేశ్వరం కమిషన్ ముందు సీఈ సుధాకర్‌రెడ్డి వివరణ
కాళేశ్వరం కమిషన్ విచారణ శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. ఇప్పటి వరకు కేసీఆర్ పేరు మాత్రమే విచారణ సందర్భంగా పలువురు ఇంజినీర్లు ప్రస్తావించారు. అయితే శనివారం సీఈ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. తనిఖీలు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి సబ్‌స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు సుధాకర్ రెడ్డి అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాపర్ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు సమయంలో ఎల్అండ్ టీని సంప్రదించినట్లు వివరించారు. ఈ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది.
అప్పటి ఇరిగేషన్ మంత్రి ఎవరని కమిషన్ ప్రశ్నించగా హరీశ్ రావు అంటూ సుధాకర్ సమాధానం ఇచ్చారు. హరీశ్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ల ప్రాసెస్ జరిగిందా..? అని అడగ్గా అప్పుడు ప్రాసెస్ జరగలేదని ఈసీ సుధాకర్ రెడ్డి బదులిచ్చారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఫీల్ లో జరిగిన టెస్టుల రికార్డులను వ్యాప్కోస్ సంస్థకు నామినేషన్ పద్ధతిపై ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఎందుకు ఆలస్యమయ్యాయని కమిషన్ ప్రశ్నించింది.
అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయని మేడిగడ్డ బ్యారేజీ పైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదని చెప్పారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపులో భాగంగా మంత్రి, ఈఎన్సీ సైట్‌ను పరిశీలించి రివైజ్డ్ చెల్లింపులకు ఆదేశించారని సీఈ సమాధానమిచ్చారు. పనులు పరిశీలించకుండా ఎవరో వచ్చి చెబితే సబ్దాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. పనులు పూర్తయి యూజ్ చేసుకునే వీలుంటే ఇవ్వొచ్చని అందుకే ఇచ్చామని వివరించారు. కనీసం చెక్ చేయకుండా సర్టిఫికేట్ జారీ చేస్తే ఎలా ? అని కమిషన్ ప్రశ్నించింది.
వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే దెబ్బతిన్న బ్లాకులు : వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయని చీఫ్ ఇంజినీర్ (సీఈ) సుధాకర్‌రెడ్డి కమిషన్‌కు వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయనను విచారించింది. డీపీఆర్ తయారీ పనులను నామినేషన్ పద్ధతిన వ్యాప్కోస్‌కు అప్పగించినట్లు సుధాకర్‌రెడ్డి కమిషన్‌కు తెలిపారు. తనిఖీలు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి సబ్‌స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చినట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ఖరారు వేళ ఎల్అండ్టీ సంస్థని సంప్రదించినట్లు వివరించారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు.