అధికారంలో ఉంటే అధికారులంతా చుట్టాలే. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అంతా శత్రువర్గమే. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ తీరు కూడా ఇలాగే మారింది. మొన్నటిదాకా బెస్ట్ ఆఫీసర్స్ అంటూ రాగం తీసిన వాళ్లే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. మొన్నటిదాకా నచ్చిన ఆఫీసర్లే ఇప్పుడు శత్రుశేషంలో చేరిపోయారు. అధికారంలో ఉన్నది ఎవరైనా వారికి అధికార యంత్రాంగం అనుకూలంగానే ఉంటుంది. ఏ ప్రభుత్వంలోనైనా ఇది సహజమే. కానీ, ఇప్పుడు కేటీఆర్ కేవలం అధికారులపైనే విరుచుకుపడటం సొంత పార్టీలో కూడా మింగుడు పడటం లేదు. పదవులు శాశ్వతం కాదు ఐదేళ్లు గడిస్తే ప్రభుత్వం మారిపోతుంది. కానీ, అధికారులు మాత్రం రిటైర్మెంట్ అయ్యే వరకు ఉద్యోగంలోనే ఉంటారు. కాబట్టి నాయకులు అధికారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. అలా లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు. అంతే కాకుండా అధికారులను హెచ్చరించిన ఏ నాయకుడినీ ప్రజలు మెచ్చుకోరు. ఆ విషయం తెలియకో.. తెలిసో కానీ కొన్నిసార్లు నోరుజారుతుంటారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే పనిచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు అధికారులను హెచ్చరించిన కేటీఆర్ అధికారం కోల్పోయిన తరవాత కూడా అదే తీరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన సిరిసిల్లలో జరిగిన ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల కలెక్టర్ పై తిట్ల పురాణం అందుకున్నారు. ఇక్కడి కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని, సన్నాసి అంటూ నోరుపారేసుకున్నారు. ఇలాంటి సన్నాసిని సిరిసిల్లకు కలెక్టర్ గా తీసుకువచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులను కూడా దుర్భాషలాడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతిచేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే తాము అధికారంలోకి వచ్చిన తరవాత వడ్డీతో సహా చెల్లిస్తామని, ఆ బాధ్యత తానే తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. తాను అంతమంచి వ్యక్తిని కాదని, ఆ పని ఖచ్చితంగా చేసి చూపిస్తానని అన్నారు. అక్కడితో ఆగకుండా చేతులతో సైగలు చేస్తూ కేటీఆర్ హెచ్చరించారు. గతంలో మాజీ సీఎం జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పలుమార్లు బహిరంగ సభలలో జగన్ అధికారులను హెచ్చరించారు. చేతులతో వెంట్రుకలను చూపిస్తూ సైగలు చేశారు. ఎన్నికల ముందు సభల్లో జగన్ ఇలా వ్యవహరించగా ఫలితాల తరవాత ఊహించని షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటూ వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ నేతల్లో జోష్ పెంచినా ప్రజల్లో మాత్రం నెగిటివీని తెచ్చిపెడతాయని జగన్ గ్రహించలేకపోయారు. ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా అదే తప్పు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పటికప్పుడు హీరోయిజంలా అనిపించినా ఫలితాలు మరోలా ఉంటాయని ఆయన గ్రహించలేకపోతున్నారు. ఆయన తీరు మార్చుకోకపోతే ఏపీలో వైసీపీకి వచ్చిన పరిస్థితే వస్తుందని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు.