ఝార్ఖండ్‌లో తొలి విడతతోపాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించగా, సిక్కింలోని 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో బుధవారం 31 చోట్ల పోలింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది. ఝార్ఖండ్‌లో ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 1 గంట వరకు 46.25 శాతం పోలింగ్ నమోదైంది. రాంచీ పోలింగ్ కేంద్రంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బర్హైత్ స్థానం నుంచి హేమంత్ సోరెన్, గాండే నియోజకవర్గం నుంచి కల్పన పోటీ చేస్తున్నారు. ఆ రెండు స్థానాలకు రెండో దశలో పోలింగ్ జరగనుంది.
నక్సలైట్‌ల హెచ్చరికలను లెక్కచేయని ఓటర్లు
జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భుమ్ జిల్లా జగన్నాథ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సొనాపీ గ్రామంలో పోలింగ్ జరుగుతున్నది. ఈ క్రమంలో గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని ముందుగానే నక్సలైట్‌లు హెచ్చరించారు. అంతేగాక మంగళవారం రాత్రి గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఓటు వేయవద్దనే హెచ్చరికలతో కూడిన పోస్టర్లు వేశారు.
అయినా సొనాపీ గ్రామ ప్రజలు భయపడలేదు. నక్సలైట్‌ల హెచ్చరికలను ఖాతరు చేయలేదు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో ఓటర్లు ధైర్యంగా పోలింగ్ బూత్‌లకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో ఆ గ్రామంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ప్రాథమిక పాఠశాలలోని 25వ నంబర్ పోలింగ్ బూత్‌లో అయితే ఉదయం 11 గంటలకే 60 శాతం పోలింగ్ పూర్తయ్యింది.