Wednesday, January 22, 2025

‘‌నేను రివైంజ్‌ ‌పాలిటిక్స్‌కు వ్యతిరేకం’

  • వోడిపోయిన తర్వాత బాధపడాల్సి ఉంటుంది
  • పైసలు తీసుకోకుండా పని చేసే నేత ఎవరైనా ఉన్నారా?
  • గత ఎమ్మెల్యే ఎన్నికల్లో హరీష్‌రావు వల్లే వోడిపోయా…
  • తాజా తెలంగాణ రాజకీయాలపై టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమ‌ని, రివైంజ్‌ ‌పాలిటిక్స్ ఎవరికీ కూడా మంచిది కాదని, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా రివైంజ్‌ ‌పాలిటిక్స్ ‌చేస్తే వోడిపోయాక బాధపడాల్సి వొస్తుందని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న జగ్గారెడ్డి సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకం అని, అయినా రివైంజ్‌ ‌పాలిటిక్స్ ఏ ‌పార్టీకి కూడా మంచిది కాదని హితవు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు రివైంజ్‌ ‌రాజకీయాలు చేసే వాళ్లు అధికారం కోల్పోయాక బాధపడాల్సి వొస్తుందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన దివంగత వైఎస్‌.‌రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరూ కూడా రివైంజ్‌ ‌పాలిటిక్స్ ‌చేయలేదన్నారు. రాజకీయాల్లో ఎవరైనా తనకు నష్టం చేసినా…తాను మాత్రం ఎవరికీ నష్టం చేయనని జగ్గారెడ్డి అన్నారు.

అయితే, రాజకీయ యుద్ధం మాత్రం చేస్తానని అన్నారు. డబ్బులు తీసుకోకుండా పనులు చేసే రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? చెప్పాలని ప్రశ్నించారు. డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్లుగా ఎవరైనా ఒప్పుకుంటారా? తనతో సహా పైసలు ముట్టకోకుండా రాజకీయం చేయని రాజకీయ నాయకుడెవరూ లేరని జగ్గారెడ్డి తనదైనశైలిలో చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్‌రావు కారణంగానే ఓడిపోయానని అన్నారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానాన్ని గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని హరీష్‌రావు ఛాలెంజ్‌గా తీసుకుని సంగారెడ్డిలో కసిగా పని చేశాడన్నారు.

తన ప్లానింగ్‌ ‌మొత్తానికి భగ్నం చేశాడనీ, ఈ విషయం తనకు ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఒకరి ద్వారా తెలిసిందన్నారు. 2023ఎన్నికలకు ముందు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదన్నారు. తన భార్య నిర్మలతో పాటు కూతురు జయారెడ్డి అలియాస్‌ ‌కూచీ, అనుచరులను పోటీ చేయడమని అడిగాననీ, కానీ వారందరూ తననే పోటీ చేయమని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. తన భార్య నిర్మల కార్పొరేషన్‌ ‌ఛైర్‌పర్సన్‌ అయినా ఆమె ప్రోటోకాల్‌లో రెండో స్థానంలో ఉండాల్సిందేననీ, సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకే ప్రోటోకాల్‌లో ప్రయారిటీ ఉంటుందన్నారు. హరీష్‌రావు వల్లే ఓడిపోయినా కూడా తాను మాత్రం రాజకీయంగా కక్షసాధింపుకు పాల్పడనని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

జగ్గుభాయ్‌ అం‌టే సాదా సీదా లీడర్‌ ‌కాదూ..ఫైర్‌ ‌లీడర్‌
సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీలో ఫైర్‌‌బ్రాండ్‌గా పేరుంది. ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా చెబుతారనే పేరు ఉండటమే కాకుండా, కాంగ్రెస్‌ ‌పార్టీలో మాస్‌ ‌లీడర్‌గానూ పేరుంది.  సొంత పార్టీ నేతలా.. బయటి పార్టీ నేతలా అని చూడరు. ఆయనకు కోపమొస్తే అవతటి లీడర్‌ ఎం‌త పెద్దయినా సరే అవేమీ పట్టించుకోకుండా విమర్శలు చేస్తుంటారు. తాను చేసే సంచలన కామెంట్లతో ప్రతీసారి పార్టీ పెద్దలను కూడా ఉక్కిరిబిక్కిరి చేసే జగ్గారెడ్డి..ఎప్పటిలాగే మొన్న… కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ ‌మున్షీ, ఏఐసిసి నేత విష్ణుపై తనదైనశైలిలో ఫైర్‌ అయ్యాడు. నేడు…రివైంజ్‌ ‌పాలిటిక్స్ ‌మంచిది కాదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రకంపలను రేపుతున్నాయి.  దీపాదాస్‌ ‌మున్షీ, విష్ణుపై, రివైంజ్‌ ‌పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌పార్టీలో కలకలం రేపుతున్నాయి. చర్చనీయాంశంగా మారాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం ఎమిటన్న దానిపై అటు శ్రేణులు.. నాయకత్వంలోనూ చర్చ జరుగుతుండగా…జగ్గారెడ్డికి కోపం రావడానికి ప్రధాన కారణం..నామినేటెడ్‌ ‌పదవులను ఇష్టమొచ్చినట్లుగా నియామకం చేస్తున్నారన్నది.
ఇదే విషయంపై  ఆయన బహిరంగంగానే పార్టీ ఇంఛార్జి దీపాదాస్‌ ‌మున్షీ, విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్‌ ‌పదవులకు నియామకానికి సంబంధించి సీనియర్ల అభిప్రాయాలను తీసుకోకపోవడమే కాకుండా, కనీసం సమాచారం లేకుండానే సిఫార్సులు చేయడం,  నియమితులైనట్లు  ప్రకటనలు రావడంతో జగ్గారెడ్డి ఆగ్ర‌హానికి కారణంగా తెలుస్తుంది. అయితే జగ్గారెడ్డి…కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహూల్‌గాంధీ చెప్పడంతో గత కొంత కాలంగా జగ్గారెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చాక దాదాపుగా వివాదాలకు దూరంగా ఉండేందుకు యత్నిస్తున్నారు.. అయితే, ఉన్న ఫలంగా ఏకంగా జాతీయ కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ ‌మున్షీ, విష్ణును టార్గెట్‌గా చేస్తూ చేసిన వ్యాఖ్యలకు తోడుగా  ఇప్పుడు … కక్ష సాధింపు రాజకీయాలు ఏ ‌పార్టీకి కూడా మంచిది కాదని హితవు పలికారు. పార్టీలో పదవులు, ప్రభుత్వంలో నామినేటెడ్‌ ‌పదవులకు సంబంధించి స్థానిక నేతలకు సరైన సమాచారం ఉండకపోవడంపై ఏకంగా ఏఐసిసి నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దీపాదాస్‌ ‌మున్షీ, విష్ణు తమ పనితీరును మార్చుకోవాలని హితవు పలుకుతూనే ఒకింత వార్నింగ్‌ ఇవ్వడం పార్టీలో సంచలనంగా మారాయి.
అయితే, తాజాగా..చేసిన వ్యాఖ్యల వెనకాల కూడా బలమైన కారణాలే ఉంటాయని ఆయనకు అత్యంత సన్నిహితులు సోమవారం‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ చెప్పారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్‌ ‌పదవులు, టిపిసిసి కార్యవర్గం భర్తీ చేయడంతో పాటు వొచ్చే నెల మొదటి వారంలో కేబినెట్‌లో ఖాలీగా ఉన్న మంత్రుల భర్తీకి సంబంధించి ఏఐసిసి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో వీటికి సంబంధించి అటు సిఎం రేవంత్‌రెడ్డి, ఇటు టిపిసిసి చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌ ‌కసరత్తు చేస్తున్న వేళ…టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌హోదాలో, పార్టీలో ఫైర్‌‌బ్రాండ్‌గా, మాస్‌లీడర్‌గా పేరున్న జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీని ఒక కుదుపు కుదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం పార్టీకి చెందిన ‘ముఖ్యు’లనే టార్గెట్‌ ‌చేసినట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకునే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం అంత ఆషామాషీగా చేసినవి కాదనీ, ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని పార్టీలో కొత్త చర్చ నడుస్తోంది. చూడాలి మరి!

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com