నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ గురువారం సాయంత్రం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈఎస్ఏకు చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి పీఎస్ఎల్వీ సీ59 (PSLV C59) వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4:04 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా – 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ఇస్రో (ISRO) ప్రయోగించింది. 550 కిలోల బరువున్న ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. సూర్యుని బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధన చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. కాగా, బుధవారం ఈ ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో గురువారానికి వాయిదా పడింది.
శాస్త్రవేత్తల హర్షం
పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్నాథ్ హర్షం వ్యక్తం చేస్తూ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా – 3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామన్నారు. అలాగే, ప్రోబా తదుపరి చేపట్టబోయే ప్రయోగాలను ఆయన విషెష్ చెప్పారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని.. పీఎస్ఎల్వీకి మరిన్ని అవకాశాలు కల్పించిన ఎన్ఎస్ఐఎల్కు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబరులో స్పేటెక్స్ పేరుతో పీఎస్ఎల్వీ – సీ60 ప్రయోగం ఉంటుందని చెప్పారు. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్ – 1 సోలార్ మిషన్ కొనసాగుతుందన్నారు.
అసలేంటీ ప్రయోగం..?
ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ – సీ59 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. సూర్యుని బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధన చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం కాగా.. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ప్రోబా 3 మిషన్లో కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ 2 ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరించనున్నాయి. ఈ ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి. తద్వారా సూర్యుని బయటి పొర.. కరోనాను అధ్యయనం చేస్తాయి.