తెల్లవారితే పెళ్లి పీటలు ఎక్కాలి. ఎంతో ఆనందంతో జరుపుకునే పెళ్ళి తంతు హడావిడి. సడన్‌గా వరుడు రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా రాంచంద్రంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ముందురోజు సంతోషంగా ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్న వరుడు ఇంతలోనే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మెట్ పల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంచంద్రంపేటకు చెందిన లక్కంపల్లి కిరణ్ (37) కు ఇటీవల పెళ్లి కుదిరింది. శనివారం వివాహం జరగాల్సి ఉంది.
ఇల్లంతా బంధుమిత్రులతో సందడిగా ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం కాబోయే వధూవరులు ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. రాత్రి ఇంటికి వచ్చిన కిరణ్ తన గదిలో పడుకున్నాడు. పెళ్లికొడుకును చేయాలంటూ కిరణ్ ను నిద్రలేపేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. గదిలో కిరణ్ ఉరివేసుకుని కనిపించడమే కారణం. వెంటనే కిరణ్ ను కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి కిరణ్ అప్పటికే చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మెట్ పల్లి పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. కిరణ్ ఆత్మహత్యకు కారణాలు గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు.