రాజకీయాల కోసం రాజయ్యను వాడుకుంటున్నారు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా
బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదు
పేదల ఆస్పత్రి గాంధీపైన కెటిఆర్ కుట్ర చేస్తున్నారు
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ప్రజా పాలనను ఓర్వలేకనే బిల్లా, రంగాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కెటిఆర్ ఇంకా తాను మంత్రిగా ఉన్నానని ఫీల్ అవుతున్నారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అప్పట్లో రాజయ్యను భర్తరఫ్ చేసి ఇప్పుడు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులను ప్రజలు ఛీ కొట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వారు దారికి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఏ అర్హతతో గాంధీ ఆస్పత్రిపైన బిఆర్ఎస్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిందని, పేదల ఆస్పత్రి గాంధీపైన కెటిఆర్ కుట్ర చేస్తున్నారని, గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది మనోధైర్యం దెబ్బ తీయడానికి కెటిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రతిపక్ష నేత పోస్టు కోసం కెటిఆర్, హరీష్‌లు పోటీ..
పదేళ్ల పాటు రాష్ట్రంలో వైద్యాన్ని నిర్వీర్యం చేశారని, బిఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఎలుకలు కరిచి చనిపోయారని ఆయన గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికే కమిటీల పేరుతో హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో రాజయ్య డిప్యూటీ సిఎం గా ఉంటే కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు ఓర్వలేక బర్తరఫ్ చేశారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఆయన్ను ముందు పెట్టి కెటిఆర్ రాజకీయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉస్మానియా ఆస్పత్రి మునిగిపోతే కెసిఆర్ ఏనాడు పట్టించుకోలేదని, గడీలు, ఫాంహౌస్‌లు కట్టుకున్న కెసిఆర్ ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మించలేకపోయారని ఆయన ఫైర్ అయ్యారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా సిఎం రేవంత్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచారని ఆయన తెలిపారు. ఇక డ్రామారావు డ్రామాలు బంద్ చేయాలని, ప్రతిపక్ష నాయకుడి పోస్ట్ కోసం కెటిఆర్, హరీష్ రావులు పోటీ పడి మాట్లాడుతున్నారన్నారు.
గత ప్రభుత్వం విజయ డెయిరీని నిర్వీర్యం చేసింది…
గతంలో కెసిఆర్ ప్రభుత్వం విజయ డెయిరీని నిర్వీర్యం చేసిందని, పాల రైతులకు బోనస్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి, మూడేళ్ల నుంచి ఎగ్గొట్టారని, పాల రైతులకు రూ.100 కోట్ల బోనస్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టల్స్‌కు టెండర్ లేకుండా గత ప్రభుత్వం పాలను సరఫరా చేసిందని, విజయ డెయిరీ పాలు కాకుండా హరీష్ రావు సతీమణి చెందిన మిల్చి మిల్క్‌ను టెండర్ లేకుండా సరఫనా చేశారన్న ఆరోపణలున్నాయని ఆయన తెలిపారు.
విజయ, మదర్ డెయిరీ నాశనం కావడానికి హరీష్ రావే కారణమని, రైతుల పాపం హరీష్ రావుకు తగులుతుందని, అమాయక పాల రైతుల సొమ్ము తిన్న వారి నుంచి కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయ, మదర్ డెయిరీని కాపాడటానికి తమ ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని, పాల సరఫరా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారని ఆయన తెలిపారు. మదర్ డెయిరీని బిఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లా దోచుకున్నారని, మదర్ డెయిరీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున పోటీ చేసిన డెరెక్టర్లకు డిపాజిట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. మదర్ డెయిరీపైన కాంగ్రెస్ జెండా ఎగురవేశామని, విజయ డెయిరీ బకాయిలను కూడా విడుదల చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.