Sunday, October 6, 2024

ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై ప్రభుత్వం నజర్

  • రైతు రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం కసరత్తు
  • మరికొన్ని హామీలను అమలు చేసిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలకు….

ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఆగష్టు 15వ తేదీలోపు అమలు చేయాలనుకున్న రుణమాఫీతో పాటు పలు పథకాల అమలు కోసం ఆదాయం సమకూర్చుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే వాటికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల అన్వేషణపై కసరత్తు చేస్తోంది.

మహిళలకు ప్రతినెలా రూ.2500 భృతి ఇస్తామని, రైతులకు 2లక్షల రుణమాఫీ, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంట క్వింటాల్‌కు రూ.500ల బోనస్, విద్యార్థులకు రూ.5లక్షల విద్యాభరోసా కార్డు, పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు రూ.5ల బోనస్, రూ.4వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు, వృద్ధులకు 4వేల పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరుకు భారీగా నిధులు అవసరముంది.

హరితహారం, పట్టణ, పల్లె ప్రగతి పథకాలు కొత్త విధానంలో….
వీటితో పాటు పాత పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ధరణి పోర్టల్ మార్పులు, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ భారం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. హరితహారం, పట్టణ, పల్లె ప్రగతి, చేప పిల్లల పంపిణీ పథకాలను కొత్త విధానంలో అమలు చేయాలని విధి విధానాలను సైతం ప్రభుత్వం రూపొందిస్తోంది. వీటితో పాటు పలు ప్రాజెక్టులు, రోడ్లు, నాలాల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లకు పైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

ఆయా సమస్యలకు తోడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాహణ, వడ్డీలు, విద్యుత్ బిల్లుల భారం ప్రభుత్వానికి మరింత గుదిబండగా తయారైంది. ప్రణాళిక ప్రకారం ఆదాయ వనరులు సమకూరక ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ బిల్లులు పేరుకుపోతున్నాయి. పౌరసరఫరాల శాఖలోనూ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వాడుతున్న కార్లకు ఏడాదిగా బిల్లులు చెల్లించకపోవడం ప్రస్తుత ప్రభుత్వానికి ఇదో ఆర్థిక భారంగా మారింది. ఇదే పరిస్థితి ఇతర కార్పొరేషన్లలోనూ నెలకొనడం విశేషం.

ఎంతమేరకు ఆదాయం పెంచుకోవచ్చన్న….
సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఎన్నికల హామీల అమలుకు కావాల్సిన నిధుల సమీకరణకు ఆదాయ వనరుల ఆన్వేషణలో భాగంగా అప్పులతో పాటు రాష్ట్ర పరిధిలో ఎంతమేరకు ఆదాయం పెంచుకోవచ్చన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రధానంగా భూములు విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలను సవరించి మరింత ఆదాయం వచ్చేలా చూడటంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

భూముల విలువ పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం, భూమార్పిడి, ఎల్‌ఆర్‌ఎస్ అమలు ద్వారా అదనపు ఆదాయం సమ కూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు హెచ్‌ఎండిఏ ద్వారా భూముల అమ్మకంపై కూడా కసరత్తు చేస్తోంది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను సైతం సక్రమంగా అమలు చేయాలని దీనికోసం దుబారా ఖర్చులను అరికట్టాలని అన్ని శాఖల అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఇక, పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి పెట్టుబడుల సమీకరణకు సైతం ప్రభుత్వం కసరత్తు చేయడం విశేషం.

కుల గణన పూర్తి చేసి పక్కాగా రిజర్వేషన్లు…
ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలోనే స్థానిక సంస్థలను కొన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి మొదలైన ఎన్నికల కోడ్ డిసెంబర్ 5వ తేదీన ముగిసిపోగా, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 16వ తేదీనుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగింది.

మళ్లీ స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే ఎన్నికల కోడ్ వచ్చి మరింత కాలం పరిపాలనలో స్తబ్ధతకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుల గణన పూర్తి చేసి పక్కాగా రిజర్వేషన్లు ఖరారు చేసుకొని ఎన్నికలకు వెళ్లాలని, అప్పటిదాకా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు వెసులుబాటు చిక్కుతుందని, ఇచ్చిన హామీల్లో మరికొన్నింటిని అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే కేబినెట్ విస్తరణ, నామినెటెడ్ పదవులు…
పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసే క్రమంలో కెబినెట్ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీలను కూడా త్వరలో పూర్తి చేయాలని సిఎం నిర్ణయించినట్టుగా తెలిసింది. రాష్ట్ర సీనియర్‌ల నుంచి, అధిష్టానం నుంచి ఏకాభిప్రాయం రాగానే పిసిసి అధ్యక్షుడితో పాటు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులను ఈనెలలోనే పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular