Tuesday, November 19, 2024

మరాఠీ గడ్డపై తెలుగు నేతలు

స్వరాష్ట్రాల్లో పాలన వ‌దిలేసి..
ఇక్కడి అంశాలపై అక్కడ ప్రచారం
భాష రాక కొందరు.. వచ్చీరాక మరికొందరు
మావే గొప్పలంటూ అధికార పార్టీ
ఏం చేయడం లేదంటూ విపక్ష పార్టీ నేతల ప్రచారదాడి

మరాఠీ గడ్డపై తెలుగు నేతలు రాజకీయ చక్కర్లు కొడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా.. అటూ.. ఇటూ తిరుగుతూ స్వరాష్ట్రంలో పాలనను పక్కన పడేశారు. తెలుగు ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడానికి మరాఠీ పార్టీలు పోటీపడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా షెడ్యూలిచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు. స్టార్​ క్యాంపెయినర్లుగా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న పనులను అక్కడ గొప్పలు చెప్పుతున్నారు.
లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..! అన్నట్టుంది మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో మనోళ్ల తీరు. మరాఠీ గడ్డపై ఆఖరిపోరాటంలో తెలుగునేతలే హవా చాటుతున్నారు. ఏపీ, తెలంగాణ పొలిటికల్‌ స్టార్స్ అందరూ బార్డర్లు దాటి.. మహారాష్ట్రలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా తెలుగోళ్లేనే పెట్టుకున్నారు. మరాఠీ నేతలు కూడా అక్కడి ప్రచారంలో ఫినిషింగ్ టచ్ మనోళ్లతోనే ఇప్పిస్తున్నారు.

రండి.. వచ్చి చూపించండి
రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర ఎన్నికలు ప్రీక్లైమాక్స్‌కు చేరుకున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో.. నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మరాఠా మహా సంగ్రామం ఆఖరిఘట్టంలో తెలుగు నేతల ఉనికే ఎక్కువగా ఉంది. అటు ఎన్‌డీఏ.. ఇటు ఇండీ కూటమి పెద్దలు పనిగట్టుకుని చిట్టచివరి అస్త్రంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు. ఏపీ, తెలంగాణ నుంచి బడా నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే మహా వికాస్‌ అఘాడి తరపున తొలి విడత ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మరోసారి మహా ప్రచార బరిలోకి దిగారు. చంద్రాపూర్‌, రాజురా, డిగ్రాస్, వార్దా​నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొన్నారు. నయగావ్, భోకర్, షోలాపూర్​ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు.
కేవలం సీఎం మాత్రమే కాదు.. తెలంగాణ మంత్రులు సైతం కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు ఉంటూ మహారాష్ట్రలో చురుగ్గా తిరుగుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మహారాష్ట్రలో మకాం వేశారు. పొంగులేటి శ్రీనవాసరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క కూడా నేటినుంచి మహా వికాస్‌ అఘాడి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు మహాయుతి కూటమి తరుఫున తెలంగాణ బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఆరుగ్యారంటీలు, కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్‌ఫ్లాప్ అంటూ విమర్శలతో హస్తం పార్టీని టార్గెట్‌ చేస్తున్నారు.

ఏపీ కూడా ..!
బీజేపీ లీడ్ చేస్తున్న మహా యుతి కూటమి తరఫున ఏపీ నుంచి ఐకానిక్ లీడర్లు ప్రచార బరిలోకి దిగారు. చంద్రబాబు ముంబైలో ప్రచారం చేస్తున్నారు. రెండురోజుల పాటు ఎన్‌డీఏ తరఫున చంద్రబాబు ప్రచారం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కూడా మహారాష్ట్రలోనే మకాం వేశారు. రెండు రోజుల పాటు ఐదు సభలు, రెండు రోడ్‌ షోలలో పాల్గొన్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేశారు. పవన్‌ తుపాన్ లాంటివాడంటూ గతంలో మోదీ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం..సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ పేల్చిన డైలాగులు మహారాష్ట్రలో పవన్‌కి పాపులారిటీ పెంచేశాయని జనసేన చెప్పుకుంటోంది. పవన్‌ని తిరుగులేని మాస్ లీడర్‌గా, చంద్రబాబును సీనియర్ మోస్ట్ లీడర్‌గా ప్రజంట్ చేస్తూ.. తమ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చుకుంది ఎన్‌డీఏ. ఇప్పుడు వీళ్లిద్దరి పాపులారిటీ మీద మరాఠీ గడ్డపై మహా యుతి కూటమి నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ఇక, మరాఠీ గడ్డపై దాదాపు 14 లక్షల మంది తెలుగువాళ్లున్నారని ఒక అంచనా ఉంది. పైగా.. మహారాష్ట్రలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వలసల కార్మికుల్లో ఎక్కువమంది తెలుగువారే. ముఖ్యంగా పూణే, ముంబై సహా మరికొన్ని పట్టణాల్లో తెలుగువారి సంఖ్య గట్టిగానే ఉంది. షిరిడీలో స్థిరపడ్డవారిలో తెలుగు మూలాలున్నవాళ్లు ఎక్కువ. తెలంగాణకు పొరుగు రాష్ట్రం కావడం.. గతంలో హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న ప్రాంతం కావడం.. టాలీవుడ్‌కి, బాలీవుడ్‌కీ దగ్గరి అనుబంధం కలిగి ఉండడం.. తెలుగు, మరాఠీ సంస్కృతుల్లో పోలిక ఉండడం.. ఇవన్నీ మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రభావాన్ని పెంచే అంశాలే. అందుకే.. అక్కడి తెలుగు ఓటుబ్యాంకుల్ని కొల్లగొట్టడానికి మరాఠీ పార్టీలు పోటీపడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా షెడ్యూలిచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు.

ఇక్కడ మరి..?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఫీక్​కు చేరుతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో లగచర్ల విషయం రాష్ట్రాన్ని ఒక్కసారిగా రాజకీయ దాడిలోకి తీసుకుపోయింది. రైతులకు ఇంకా రుణమాఫీతో పాటుగా చాలా అంశాలు పెండింగ్​లో ఉన్నాయి. ఇటు మూసీ ప్రక్షాళన ముప్పు తెచ్చింది. ఇలాంటివన్నీ వదిలేసిన తెలంగాణ కేబినెట్​.. మహారాష్ట్రలోనే మకాం పెట్టింది.

మావే గ్రేట్​
ఇక, స్వరాష్ట్రంలో పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నా.. పక్క రాష్ట్రంలో మాత్రం మన తెలుగు నేతలు కాలరెగరేస్తున్నారు. మేం చేస్తున్నామంటే.. మేం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో చేయాల్సిన పంచాయతీ మొత్తం ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్రలో పెట్టుకున్నారు. మూసీ ప్రక్షాళనపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలో మహారాష్ట్రలో ప్రచారానికి తీసుకున్నాయి. రైతు రుణమాఫీ కూడా మేమే చేశామంటూ కాంగ్రెస్​ చెప్తున్నది. ఇటు ఉద్యోగాల భర్తీని కూడా కొన్ని తేడా లెక్కలతో మరాఠీ యువతకు చెప్పుతున్నారు. రాష్ట్ర సమస్యలు, గొప్పలన్నీ పక్క రాష్ట్ర ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular