బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా త్వరలో చేపట్టబోయే సామాజిక ఆర్థిక కులగణనకు సంబంధించి కార్యచరణ ప్రణాళికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళా భరణం కృష్ణమోహన్ రావు ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించారు. ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అనంతరం దుండ్ర కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ కుల గణన చేపట్టాలని చాలాకాలంగా బలహీనవర్గాలు కోరుతున్నారని ఆయన తెలిపారు.
కులగణనకు కావలసిన మెథడాలజీ, ప్రశ్నావళి రూపకల్పన చేసి తమకు అందజేయాలని బీసీ కమిషన్ ను ప్రభుత్వం కోరినందున ఆ కార్యక్రమంలో పనిచేస్తున్న బీసీ కమిషన్ కలిసి త్వరితగతిన యాక్షన్ ప్లాన్ ను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించాలని తమ ప్రతినిధుల బృందం చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ను కోరినట్లు ఆయన వివరించారు. కమిషన్ సభ్యుడు సిహెచ్ ఉపేంద్ర , పిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, ప్రొఫెసర్ బాలయ్య, సంచార కులాల సంఘం జాతీయ అధ్యక్షుడు నరహరి, ఉమేష్, వి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.