తిక్కవరపు రమణారెడ్డి ఎన్నో పాత్రల్లో జీవించిన గొప్ప నటుడు. తన పాత్రల పట్ల అవగాహన కలిగి నిబద్ధతతో నటించిన మహానటుడు రమణారెడ్డి అని పద్మశ్రీ ,డాక్టర్ బ్రహ్మానందం పేర్కొన్నారు. ‘నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి’ పుస్తకాన్ని ఆయన తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించారు. రమణారెడ్డి పేరు వినడానికి హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఒక విధంగా నవ్వు పుట్టించే విధంగా కూడా ఉంటుంది. ఆరడుగుల బక్క పల్చని శరీరంతో నటించిన మహనీయుడు. చలన చిత్ర పరిశ్రమలో తనదొక ధోరణిని అలవర్చుకున్నవాడు. నెల్లూరు యాసను తను నటించిన అన్ని సినిమాల్లో బతికించాడు. తద్వారా తెలుగు సాహిత్యాన్ని కూడా నిలబెట్టాడు. రమణారెడ్డి గురించి నీకు ఎలా తెలుసని అడగవచ్చు. వ్యక్తిగతంగా తెలియాల్సిన అవసరం లేదు. మహానుభావుల గురించి మనం మాట్లాడుతాం. ఇది అంతే. ఆయన గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. ఆయన జీవిత చరిత్రను మనకు అందించాలనే ఆలోచనతో మూవీ వాల్యూం సంస్థ అధిపతి జీలాన్ బాషా ద్వారా ప్రయత్నం జరగడం గొప్ప విషయం. ఇలాంటి గొప్ప నటులను పరిచయం చేయాలనే ఉద్దేశం కలగడం చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్తకాన్ని ఆదరించండి.నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ ఈ పుస్తకాన్ని రాయడానికి చాలా శ్రమ పడ్డారు. సుదీర్ఘమైన జర్నలిజం అనుభవంతో ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. ఆయన మరెన్నో పుస్తకాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.