Saturday, October 5, 2024

సరిహద్దులో హై అలర్ట్ …

ఏజన్సీలో ముమ్మరంగా కూంబింగ్
తప్పించుకున్న మావోయిస్టుల కోసం వేట
బూర్గంపాడు వద్ద మావోయిస్టుల పోస్టర్లు

దంతెవాడ-, నారాయణ పూర్ సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపధ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమతమైంది. ముఖ్యంగా చత్తీష్ ఘడ్ తెలంగాణ సరిహద్దుల్లో భద్రతను కట్టు దిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఎలర్ట్ చేసి సరిహద్దులోని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో చని పోయిన వారు కాక, మరి కొంత మంది మావోయిస్టులు వున్నారని భావిస్తున్న పోలీసులు, తప్పించుకున్న వారి కోసం ముమ్మరంగా కూంబింగ్ జరుపుతున్నారు. దంతే వాడ జిల్లా బార్సూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తులతులి, నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీసు స్టేషన్ పరిధిలోని నెందురు అడవుల్లో పోలీసులు ఇంకా నక్సల్స్ కోసం గాలిస్తున్నారు. మరో వైపు తెలంగాణకు చెందిన అగ్రనేతలు కూడా ఈ ఎన్ కౌంటర్లో మరణించి వుంటారని ప్రచారం జరుగుతోంది.

మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవ రావు, దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కెళ్ళ పల్లి వాసుదేవరావు వున్నట్టు భావిస్తున్నారు. వీరిద్దరూ సుదీర్ఘ కాలంగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు. వివిధ స్థాయిల్లో పని చేసిన వీరిపైన భారీ రివార్డులు కూడా ఉన్నాయి. తక్కెళ్ళ పల్లి వాసుదేవరావుది ములుగు జిల్లా లక్షీదేవీ పల్లి కాగా, నంబళ్ల కేశవరావుకు వరంగల్ ప్రాంతంతో అనుబంధముంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి రిటర్మెంట్ తర్వాత నంబళ్ల కేశవ రావు బాధ్యతలు తీసుకున్నారు. అందుకే, ఈ ప్రాంతంపై పోలీసులు మరింత దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలోని చర్ల, భద్రాచలం ఏజన్సీలో నిఘాను పెంచారు. ప్రస్తుతం మావోయిస్టుల 20వ వార్సికోత్సవాలు జరుగుతున్న నేపధ్యంలో ఈ ఎన్ కౌంటర్ కు ముందే, జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమతమైంది. అయినా, అక్కడక్కడ మావోయిస్టుల పోస్టర్లు వెలుస్తూనే వున్నాయి. బూర్గంపాడు మండలంలోని సందెం రామాపురం వద్ద వార్సికోత్సవాల పోస్టర్లు వెలిశాయి. ఏజన్సీలో ఈ పరిస్థితి మావోయిస్టుల వారోత్సవాలు ముగిసే వరకు, అంటే ఈ నెల 20 వరకూ కొనసాగే అవకాశముంది.

సి.పి.ఐ ఎంఎల్ మాస్ లైన్ ఖంఢన
కేంద్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర పోలీస్ బలగాలు మావోయిస్టులను కాల్చి చంపడాన్ని సి.పి.ఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖంఢించింది. నారాయణ పూర్ దంతెవాడ సరిహద్దులోని నేందురు, తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయినట్లు తెలుసుకొని కాల్చేశారని, ఇది దుర్మార్గమైన చర్యని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అభిప్రాయ పడ్డారు. ఇది, హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్లు కగార్ ఆపరేషన్ ఎన్కౌంటర్ గా స్పష్టమవుతోందని, ఈ మధ్య కాలంలో 180 మందికి పైగా మావోయిస్టులు మృతువాత పడ్డారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం అరెస్టు చేయ కుండా, విచారణ జరిపి శిక్షించ కుండా ఇలా చంపేయడం చట్ట వ్యతిరేకమని రంగా రావు అన్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని మాను కోవాలని, రాజ్యం ఇలా మూకుమ్మడి హత్యాకాండకు పూనుకోవడం సరైంది కాదని హితవు పలికారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular