టీజర్ తోనే హైప్
టికెట్ ధరల పెంపునకు ముందస్తు ప్లాన్
ప్రతి సినిమాకు ఇదే సూత్రం
టాలీవుడ్ లో కొత్త ట్రెండ్
ఇప్పుడు పుష్ప- 2ది అదే తంతు
మండిపడుతున్న ప్రేక్షకులు
తెలుగు చిత్ర పరిశ్రమ ఇటీవల కొత్త ట్రిక్కులు మొదలుపెట్టింది. భారీ బడ్జెట్ సినిమాలు అంటూ వందల కోట్ల బడ్జెట్‌ను చూపిస్తూ.. నాలుగింతలు వసూలు చేసుకునేందుకు హైప్ ప్లాన్ ను అమలు చేస్తుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలా ఉన్నా.. ప్రేక్షకుల జేబులు మాత్రం గుల్లవుతున్నాయి. ఇటీవల వస్తున్న స్టార్స్ చిత్రాలన్నీ ఇదే తంతును అమలు చేస్తున్నాయి. తాజాగా పుష్ప-2 కూడా టీజర్ లాంచ్ తోనే భారీ అంచనాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ముందు నుంచే టీజర్‌పై ఊహించని అంచనాలను మొదలుపెట్టింది. దీనికి అనుకూల మీడియాను అవకాశంగా తీసుకుంటున్నది. అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టి.. ప్రేక్షకులపై భారీ బడ్జెట్‌ను పెడుతున్నది. అటు మీడియా కూడా ఈ సినీ ప్యాకేజీలకు ఆశపడి.. ఆడని సినిమాలకు కూడా విచ్చలవిడి హైప్ ను క్రీయేట్ చేస్తున్నది. గతంలో సాహో, గాడ్ ఫాదర్, ఆచార్య, గుంటూరుకారం వంటి ప్లాఫ్ సినిమాలకు టీజర్ నుంచే ఎడతెగని హైప్‌ను తీసుకువచ్చారు. కానీ, అవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. కానీ.. ఈ సినిమాలన్నింటికీ టికెట్ ధరలను మాత్రం భారీగా పెంచారు.
హైదరాబాద్ అక్కరకు రాదా..?
సినీ పరిశ్రమకు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ చాలా కీలకం. స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి. సినిమా షూటింగ్‌లు మొత్తం ఇక్కడే జరుగుతాయి. కానీ, తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రం హైదరాబాద్ ను పక్కన పెట్టేస్తున్నారు. ఇటీవల రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్‌ను లక్నోలో నిర్వహించారు. తాజాగా పుష్ప -2 టీజర్‌ను కూడా పాట్నాలో చేశారు. ఇలా గతంలో కొన్ని సినిమాలు కూడా ముంబై, గోవా, పూణే వంటి ప్రాంతాల్లో చేశారు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా బృందాలతో వెళ్లి ఇతర ప్రాంతాల్లో టీజర్ లాంచ్ చేయడంపై కొన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.
పుష్ప కోసం సేమ్ సీన్
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పుష్ప-2 మూవీ డిసెంబర్5న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను తాజాగా పాట్నాలో విడుదల చేశారు. టాలీవుడ్‌లో ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా అంటే చాలు.. ముందు ఆ సినిమా ఎలా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ముందు ఆ సినిమాకి పెద్ద హైప్ తెచ్చేయడం ప్రస్తుత ట్రెండ్ అయిపోయింది. కొన్ని అనుకూల మీడియా సంస్థలు ఆ చిత్ర పీఆర్‌ఓలు ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాని ముందు బాగా పైకి లేపుతారు. టీజర్..ట్రైలర్..సాంగ్‌లాంగ్ అంటూ ఇలా ఒక పెళ్ళి చేసినట్లు రోజుకో ప్రోగ్రామ్ పెట్టి ఆ సినిమాకి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేసేసి ప్రేక్షకుల్లో ఎలాగైనా ఈ సినిమా చూసేయాలిరా బాబు అన్న రేంజ్ కి ప్రేక్షకుడి మైండ్ సెట్‌ని తీసుకువచ్చేస్తారు. ఒక సగటు ప్రేక్షకుడు ఇది థియేటర్‌లో ఎప్పుడు విడుదలవుతుంది. ఈ సినిమాని చూసి ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్న సమయానికి కరెక్ట్‌గా రిలీజ్‌కి ఇంకా రెండు మూడు రోజులు ఉంది అనగా సినిమా వ్యాపారం మొదలవుతుంది.
టికెట్ ధరలు భారీగా పెంపు
సినిమాకు హైప్ రాగానే.. విడుదల సమయానికి ముందు టికెట్ ధరలు అమాంతం ఒక్కసారిగా పెంచేస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చేసే అంత సీన్ లేకుండా చేసేస్తారు. ఏమంటే పెద్ద హీరో.. పెద్ద డైరెక్టర్.. మంచి కథ అంటూ ఇలా రక రకాల కారణాలతో బిగ్ కాస్టింగ్ కారణం చూపించి టికెట్ రేట్లు పెంచేస్తారు. ఈ క్రమంలో పుష్ప2 టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. టికెట్ రేట్లు పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు లీకవుతుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ వంటి ప్రాంతాలు, ప్రధాన నగరాల్లో రూ.150-300 ఉన్న టికెట్ రేటును ఏకంగా 500కు తీసుకుపోతున్నట్లు టాక్.
సర్కారు సమాధానమేమిటి..?
ప్రస్తుతం రాష్ట్ర సర్కారుకు, సినీ ఇండస్ట్రీకి కొంత గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రానున్న సినిమాలకు టికెట్ ధరల పెంపుపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్‌లో విలేఖరుల సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టికెట్ రేటు పెంచేదే లే అంటూ స్పష్టంగా చెప్పారు. ఎంత పెద్ద హీరో అయినా సరే మా వద్దకు టికెట్ రేట్ పెంచమని రావద్దని, అలా వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి మాట్లాడటానికి కూడా సమయం కేటాయించేది లేదని ప్రకటించారు. అంతేకాకుండా గతంలో సీఎం రేవంత్ కూడా ఇదే తరహా నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్ ధరల పెంపునకు ముందు ప్రభుత్వం తీసుకునే కొన్ని ముఖ్యమైన అంశాలకు అండగా ఉండాలని కోరారు. కానీ, సీఎం రిక్వెస్ట్‌ను సినీ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిణామాల్లో తెలంగాణ ప్రభుతం ఈ విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి. గతంలో టికెట్ రేటు వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. టికెట్ ధరను తగ్గించడం ముమ్మాటికీ తప్పేనన్నారు. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ఉత్పత్తి దారుడికి మాత్రమే ఉంటుందని రామ్‌గోపాల్ గతంలో అన్నారు.
బాలీవుడ్‌కి పుష్ప భయం
బాలీవుడ్‌కు ‘పుష్ప’ భయం పట్టుకుంది. పుష్ప-2 ఓపెనింగ్స్‌పై ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 సినిమా నార్త్‌లో రూ. 50 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి తెలుగు మూవీగా రికార్డులకెక్కింది. అయితే, ఓవరాల్‌గా మాత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్‌ఖాన్ జవాన్ సినిమా ఉత్తరాదిలో రూ. 65 కోట్ల ఓపెనింగ్స్‌తో అత్యధిక ఓపెనింగ్స్ రికార్డు సొంతం చేసుకుంది. అయితే, పాట్నాలో పుష్ప- 2 ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసిన వారు షారూఖ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని చెబుతున్నారు. అదే జరిగితే బాలీవుడ్ నటులకు కంటి మీద కునుకు ఉండదని అంటున్నారు. ఒకవేళ అంచనా వేస్తున్నట్టుగానే షారూఖ్ జవాన్ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ రికార్డును పుష్ప-2 బద్దలుగొడితే ఆ తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేయడం ఇప్పట్లో బాలీవుడ్ తరం కాకపోవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది.