సెలబ్రెటీలు.. పెళ్ళిళ్ళు.. విడిపోవడాలు ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ – సైరా బాను దంపతులు విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున రెహమాన్ టీంలోని మోహిని డే అనే అసిస్టెంట్ కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. గురు శిష్యురాలు ఒకే రోజు తమ డివోర్స్ గురించి ప్రకటనలు చేయడంతో, వారి సంబంధం గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిపై తాజాగా సైరా తరపు లాయర్ స్పందించారు. ఏఆర్ రెహమాన్, మోహిని డే ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే తమ భాగస్వాములతో విడిపోతున్నట్లు ప్రకటించడం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇది యాదృచ్చికంగా జరిగిందా? లేదా ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ డిస్కషన్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, దీనిపై సైరా బాను తరపు న్యాయవాది వందనా షా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ‘‘మోహిని డే విడాకులతో ఏఆర్ రెహమాన్ డివోర్స్ కి ఎలాంటి సంబంధం లేదు. సైరా- రెహమాన్ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వివాహ బంధానికి స్వస్తి పలకడం ఎంతో బాధతో కూడుకున్న విషయం.కలిసి ఉన్నా, విడిగా ఉన్నా వారిద్దరూ ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు’’ అని వందనా షా మీడియాకి తెలిపారు.