Friday, November 29, 2024

ఇథనాల్ కంపెనీ అనుమతుల్లో అన్నీ అక్రమాలే…!

  • కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ కు అనుమతి ఇస్తే
  • ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రీయల్ స్పిరిట్,
  • అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి ఉత్పత్తులకు గత మంత్రివర్గం ఆమోదం
  • గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్‌ఓసీ లేకుండానే కాంపౌండ్ వాల్ నిర్మాణం
  • పర్యావరణ అనుమతుల నిబంధనల సైతం ఉల్లంఘించినట్టు
  • ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీ అనుమతుల విషయంలో పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను గత ప్రభుత్వం ఉల్లంఘించిందని, నిబంధనలను తుంగలో తొక్కిందని ప్రస్తుతం అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అనుమతుల పేరుతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిందని ఈ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఒక దానికి అనుమతి తీసుకొని వేరే ఉత్పత్తులకు గత మంత్రివర్గం ఆమోదించిందని అధికారులు తమ నివేదికలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ కు అనుమతి ఇస్తే ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రీయల్ స్పిరిట్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు అప్పటి మంత్రివర్గం అనుమతి ఇచ్చిందని అధికారులు ఇచ్చిన నివేదికలో తెలిపారు.

ఫ్యూయల్ ఇథనాల్‌ను సాకుగా చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఈ కంపెనీ అడ్డదారులు అనుసరించిందని అధికారులు ప్రస్తుతం ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి ప్రభుత్వం కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు అనుమతులు జారీ చేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ) నుంచి ఈ కంపెనీ నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) తీసుకోవటం తప్పనిసరి కాగా, పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించింది.

లెటర్ ఆఫ్ ఇండెంట్
అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అండదండలుండటంతో పర్యావరణ అనుమతుల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిందని అధికారులు నివేదికలో తెలిపారు. లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్‌ఓఐ) 22.-10-.2022వ తేదీన 600 లక్షల లీటర్ల ఇథనాల్/ ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రీయల్ స్పిరిట్, అబ్జల్యూట్ ఆల్కహాల్ తయారీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర కేబినేట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఈ ఆదేశాలు జారీ చేసింది. 2022 డిసెంబర్‌లో కేబినెట్ ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై సైతం చేసిందని నివేదికలో అధికారులు తెలిపారు.

పర్యావరణ అనుమతి (ఈసీ)
ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రీయల్ స్పిరిట్, అబ్జల్యూట్ ఆల్కహాల్ తయారీకి పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది. కానీ, కేంద్ర పర్యావరణ శాఖకు ‘ఫ్యూయల్ ఎథనాల్‘ కోసమే దరఖాస్తు చేసింది. అక్కడ ప్రతిపాదించిన 300 కెఎల్‌పిడి సామర్థ్యం మొత్తం ‘ఫ్యూయల్ ఎథనాల్’ తయారీకేనని కంపెనీ స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించడం విశేషం.

ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు
కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బి2 కేటగిరీకి వస్తుందని ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయించారు.

మరోసారి లెటర్ ఆఫ్ ఇండెంట్
24-.02-.2023వ తేదీన కేంద్ర పర్యావరణ శాఖ ‘ఫ్యూయల్ ఇథనాల్‘ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 01.-04.-2023వ తేదీన ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌లో ఫ్యూయల్ ఇథనాల్ కు పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను (ఎల్‌ఓఐ) మరోసారి జారీ చేసింది.

లైసెన్స్ కోసం దరఖాస్తు
కేంద్రం పర్యావరణ శాఖ కేవలం ‘ఫ్యూయల్ ఇథనాల్‘ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ, పిఓకే కంపెనీ దానికి పరిమితం కాకుండా, కొత్త లెటర్ ఆఫ్ ఇండెంట్ ను చూపించి 07-.06-.2023వ తేదీన ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రీయల్ స్పిరిట్, అబ్జల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది.

పర్యావరణ నిబంధన ఉల్లంఘన
పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ) నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) తీసుకోవటం తప్పనిసరి. కానీ, పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్‌ను నిర్మించింది. పర్యావరణ అనుమతుల నిబంధనలను మాత్రం ఉల్లంఘించింది.

నీటి అనుమతి
ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 15-.06.-2023వ తేదీన ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతి ఇచ్చింది.

టిఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు
07.-12.-2023కు ముందే టిఎస్ ఐపాస్ ద్వారా ఈ కంపెనీకి అనుమతులన్నీ జారీ అయ్యాయని అధికారులు నివేదిక అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular