Friday, September 20, 2024

ఇప్పుడు మహేశ్​ మార్క్​

త్వరలోనే టీపీసీసీ కొత్త కార్యవర్గం

రాష్ట్రంలో త్వరలో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కానుంది. పాత కార్యవర్గం అంతా రద్దు కావడంతో కొత్తది ఏర్పాటు కావాల్సి ఉండటంతో ఆ దిశలో ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. మొదట వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం, ఆ తర్వాత ఇతర కార్యవర్గం కూర్పు ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి కావడంతో కార్యవర్గం ఎంపికపై ఏఐసీసీ దృష్టి సారించింది. ఈ నెల 15వ తేదీన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​కుమార్‌ గౌడ్‌ పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. కొత్త అధ్యక్షుడు నియామకం కావడంతో పాత కార్యవర్గం పూర్తిగా రద్దయింది. తాజాగా మహేశ్​కుమార్‌ గౌడ్‌ సారథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే గతంలో పీసీసీ కార్యవర్గం జంబో జట్టులా ఉండేది. కానీ ఈసారి పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేయాలన్న యోచనలో నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అధ్యక్ష స్థానం కోసం పోటీపడిన వారికి వర్కింగ్​ ప్రెసిడెంట్​
ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ వారిలో కొందరికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులు ఇచ్చి సంతృప్తి పరిచే అవకాశం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి పార్టీ అధిష్ఠానం ఇచ్చింది. ఎంపీ బలరాం నాయక్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్‌ కుమార్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు, ఆ రెండు పేర్లను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంస్థాగత వర్కింగ్‌ ప్రెసిడెంట్​ నియామకం
ఏఐసీసీ సిఫారసు చేసినట్లయితే వంశీచంద్‌ రెడ్డికే ఆ పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, రోహిన్‌ రెడ్డిలు ఇద్దరు కూడా సీఎం రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వీరిలో ఒకరికి వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవి ఇప్పించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఒక్కరిని ఎంపిక చేసి, సంస్థాగత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గద్వాల్‌ మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య, మహిళా కాంగ్రెస్‌ ప్రస్తుత అధ్యక్షురాలు సునీతా రావులలో ఎవరికో ఒకరికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దక్కే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గాలు వారీగా చూస్తే మైనారిటీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్‌ పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 5 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులు భర్తీ చేసే దిశలో ఏఐసీసీ కసరత్తు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రచార కమిటీ ఛైర్మన్​, ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియామకం అయ్యే అవకాశం ఉంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ పదవితో పాటు అధికార ప్రతినిధులు ఎంపిక కావాల్సి ఉంది. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతా రావు పదవీ కాలం ముగియడంతో ఆమె స్థానంలో మరొకరిని నియమించేందుకూ ఏఐసీసీ కసరత్తు చేస్తోంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular