- రెండు ఉద్యోగ సంఘాల జేఏసిలు…
- రెండుగా చీలిన ప్రభుత్వ ఉద్యోగులు…
- జేఏసిల ఏర్పాటుతో సమస్యలు పరిష్కారం అయ్యేనా..!
పెండింగ్ సమస్యల పరిష్కారం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు రెండుగా చీలిపోయారు. దీంతో ఆ సంఘాల నాయకులు రెండు జేఏసిలను వివిధ సంఘాల మద్ధతుతో ఏర్పాటు చేసుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ జేఏసికి తమ మద్ధతు ఇవ్వాలో తెలియక ప్రస్తుతం ఉద్యోగులు గందరగోళంలో ఉండగా ఏ జేఏసికి ఎంత ఆదరణ ఉందో తేల్చుకుందామని ఇరు వర్గాల జేఏసి నాయకులు పేర్కొంటుండడం విశేషం. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా వ్యవహారిస్తుండడంతో ఉద్యోగుల్లో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ సంఘాలతో జేఏసిని ఏర్పాటు చేసుకొని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంలో సఫలీకృతమయ్యారు.
2014 నుంచి 2023 నవంబర్ వరకు సుమారు 10 ఏళ్ల పాటు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వానికి టిఎన్జీఓ, టిజిఓ, రెవెన్యూ, టీచర్ల సంఘాలు పలుమార్లు వినతిపత్రాలను ఇచ్చి కొంతమేర తమ సమస్యలను పరిష్కరించుకున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డిసెంబర్ 2023న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సిఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత పలు ఉద్యోగ సంఘాల నాయకులు మారిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో సామరస్యంగా చర్చించుకొని పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించడం ఆ దిశగా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలను జరుపుతున్నారు.
3 లక్షల ఉద్యోగులు… 3,50,000 లక్షల పెన్షనర్‌ల మద్ధతు
ఈ నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సాధారణ బదిలీలు, పదోన్నతులతో పాటు మరికొన్ని అంశాలను ఉద్యోగ సంఘాల నాయకులు పరిష్కరించుకున్నారు. ఇంతలోనే 20 రోజుల క్రితం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ సంఘాల నాయకులతో తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ జేఏసి చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా ఏలూరి శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు. దీంతోపాటు ఈ జేఏసి స్టీరింగ్ కమిటీలో 27 ఉద్యోగ సంఘాల నాయకులకు చోటు కల్పించారు. అయితే ఈ జేఏసిలో ప్రభుత్వ గుర్తింపుపొందిన 7 ఉద్యోగ సంఘాలైన టిఎన్జీఓ, టిజిఓ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, టిఆర్‌టియూ, యూటిఎఫ్, ఎస్‌టియూ, టిఆర్‌టిఎఫ్ సంఘాలున్నాయి. వీటితో పాటు టీచర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయ సంఘాలైన ఈఎస్‌పిసి, టిటిజేసి, జాక్టో, టిఏజేఏసి తదితర సంఘాలు ఈ జేఏసిలో భాగస్వామ అయ్యాయి. వీటితో పాటు పెన్షనర్‌ల సంఘాలు సైతం తమ జేఏసికి మద్ధతు ప్రకటించాయి. దీంతో ఈ జేఏసికి సుమారుగా 150 నుంచి 200 ఉద్యోగ సంఘాల మద్ధతు ప్రకటించడంతో మొత్తంగా తమకు 3 లక్షల ఉద్యోగులతో పాటు 3,50,000 లక్షల పెన్షనర్‌ల మద్ధతు ఉందని ఈ జేఏసి నాయకులు జేఏసి చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా ఏలూరి శ్రీనివాసరావులు పేర్కొంటున్నారు.
‘కరవమంటే కప్పకు కోపం, విడమమంటే పాముకు కోపం’
అయితే 10 ఏళ్లుగా ఉద్యోగుల పెండింగ్‌ల సమస్యల కోసం ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు పోరాడ లేదని, ప్రస్తుతం అడగకముందే ఈ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుంటే ఉద్యోగుల జంగ్‌సైరన్ పేరుతో కొత్తగా జేఏసిలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి ఉందని మరికొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీకి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో మరో జేఏసిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి చైర్మన్‌గా లచ్చిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ జేఏసికి సుమారుగా 65 సంఘాల మద్ధతును ప్రకటించాయి. ప్రస్తుతం ఇలా రాష్ట్రంలో రెండు ఉద్యోగ సంఘాల జేఏసిలు ఏర్పాటు కావడంతో ఉద్యోగులు బహిరంగంగా ఏ జేఏసికి తమ మద్ధతు తెలపాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం, విడమమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉద్యోగుల పరిస్థితి తయారయ్యింది.
ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడని సమస్యలకు
రాష్ట్రంలో అసలు ఈ రెండు జేఏసిలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారన్నది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయ్యింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఎం రేవంత్ సిఎస్‌తో పాటు ఆర్ధిక శాఖ అధికారులను గతంలో ఆదేశించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సాధారణ బదిలీలు, పదోన్నతులకు ఈ మధ్య ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొంతమేర ఉద్యోగులు ఉపశమనం పొందినట్టుగా తెలిసింది. ఇక దీంతోపాటు నాలుగు డిఏ పెండింగ్‌లు, పిఆర్‌సి అమలు, సిపిఎస్ రద్దుతో పాటు సుమారుగా 30 నుంచి 40 అంశాలు పెండింగ్‌లో ఉండడం, చాలా సమస్యలకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి ముడిపడి ఉండడంతో వాటి పరిష్కారం కొంతమేర ఆలస్యం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
జేఏసిలతో నాయకులకే లబ్ధి…
ఇంతలోనే ఉద్యోగ సంఘాల నాయకులు రెండు జేఏసిలను ఏర్పాటు చేసుకోవడంతో ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు జేఏసిల నాయకులు కూడా శాంతియుతంగా ప్రభుత్వంతో చర్చించుకొని పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుందామని బహిరంగంగా పేర్కొంటున్నా, ఉద్యోగ సంఘాల జేఏసిలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తుండడం విశేషం. ఇలా ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికే ఈ జేఏసిలను ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తుండడం విశేషం. ఈ జేఏసిల పేరుతో నాయకులకు స్వలాభం కలుగుతుంది తప్ప తమకు మేలు జరగదని ఉద్యోగులు పెదవి విరుస్తుండడం గమనార్హం.
అందరిని సమన్వయం చేసుకొని ముందుకు పోతాం
తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు
మేము ఉద్యోగ సమస్యల కోసమే ఈ జేఏసిని ఏర్పాటు చేసుకున్నాం. మా జేఏసిలో ముఖ్యమైన ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వంతో మేము కోట్లాడడం లేదు. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నాం. అందరిని సమన్వయం చేసుకొని ముందుకు పోవడం వల్ల సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అవుతాయన్నది మా నమ్మకం. త్వరలోనే ట్రేడ్ యూనియన్ సంఘాలను కూడా తమ జేఏసిలో కలుపుకుంటాం.
ఉద్యోగుల్లో ఎవరికీ ఎంత ఆదరణ ఉందో తేల్చుకుందాం
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి
ఇన్నేళ్లుగా ఉద్యోగ సంఘాలుగా చెలామణీ అయిన వాళ్లు, గుర్తింపు పొందిన సంఘాల నాయకులు రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. 317 జిఓకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు. విఆర్‌ఏ, విఆర్‌ఓలను వేరే శాఖలో విలీనం చేసినప్పుడు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అడగకముందే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుంటే ఈ జేఏసిలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. జేఏసిల ఏర్పాటు కాదు ముఖ్యం, ఓటింగ్ పెడదాం, ఉద్యోగుల్లో ఎవరికీ ఎంత ఆదరణ ఉందో తేల్చుకుందాం.