- షూటింగ్లో కాంస్యం సాధించిన మను భాకర్
- ప్రశంసలతో ముంచెత్తిన రాష్ట్రపతి, ప్రధాని
- ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్, రమిత (మనూభాకర్)
ఫ్రాన్స్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. యువ షూటర్ మను భాకర్ 10మీ ఎయిర్పిస్టల్లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా సృష్టించింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజతం గెలిచారు. మరోవైపు, పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ బబుతా అదరగొట్టాడు. అతడు 630.1 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ సందీప్ సింగ్ (629.3 స్కోరు) 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.
ప్రిక్వార్టర్స్‌లో నిఖత్ జరీన్..
తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ మహిళల 50 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.
శెభాష్ మనూ..: రాష్ట్రపతి, ప్రధాని ప్రశంస
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించడంపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. 10మీ ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన యువ షూటర్ మను బాకర్‌ను పలువురు ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
దేశం గర్విస్తోంది.. రాష్ట్రపతి
ఒలింపిక్స్‌లో తన ప్రతిభతో కాంస్య పతకం సాధించి దేశం కీర్తిని చాటిన మను బాకర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందనలు తెలిపారు. ఆమెను చూసి దేశం గర్వపడుతోందని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
అపురూప విజయం: ప్రధాని మోడీ
భారత్‌కు తొలి పతకం అందించిన మను బాకర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. షూటింగ్లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించడంతో పాటు ఈ ఘనత అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించడం మరో ప్రత్యేకత అన్నారు. ఇదో అపురూపమైన విజయమన్నారు.
అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు: రాహుల్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించినందుకు గర్వంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో పాటు, ఈ విభాగంలో తొలి భారత మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించిన మను భాకర్‌ను అభినందించారు. ‘మన అమ్మాయిలు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.. ఇంకా చాలా పతకాలు రావాలి’ అని ఆకాంక్షించారు.
ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్..
పారిస్ ఒలింపిక్స్‌లో మరో భారత షూటర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకంతో మెరిసిన కొన్ని గంటలకే అర్జున్ బబుతా మెడల్‌పై ఆశలు పెంచాడు. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ గురి తప్పలేదు. 630.1 పాయింట్లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్రీడల్లో భారత షూటర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 20 ఏండ్ల రమితా జిందాల్ సైతం ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 631.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. గతంలో ఇండియా షూటర్ సుమా షిరుర్ ఒలింపిక్స్ ఫైనల్ చేరిన మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది.
ఫైనల్‌కు చేరిన భారత షూటర్ రమిత..
భారత షూటర్ రమితా జిందాల్ పారిస్ ఒలింపిక్స్ శుభారంభం చేసింది. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో జిందాల్ నిరాశపర్చాడు. అయితే ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్ ఈవెంట్లో సత్తా చాటింది. క్వాలిఫైయర్స్‌లో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
క్వాలిఫైయర్స్‌లో రమితా జిందాల్ 631.5 పాయింట్ల స్కోర్ చేసి ఐదో స్థానంలో నిలిచింది. అయితే మరో భారత్ షూటర్ ఎలావెనిల్ వేలారివన్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు.