Wednesday, December 25, 2024

ఓయ్‌… ప‌క్క‌కు వెళ్లండి

ట్రాఫిక్ కంట్రోల్‌కు ట్రాన్స్‌జెండ‌ర్లు
హోంగార్డుల త‌ర‌హాలో విధులు

ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లు రోడ్ల వెంట ట్రాఫిక్ కంట్రోల్ చేయ‌నున్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్ల సేవలను వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోవడం, పెద్దగా చదువుకునే అవకాశాలు లేకపోవడంతో ట్రాన్స్‌జెండర్లు విధిలేని పరిస్థితుల్లో రోడ్ల వెంబడి, రైళ్లలో యాచిస్తున్నార‌ని ప్ర‌భుత్వం గుర్తించింది. ఇలాంటి దుర్భర జీవితాన్ని గడుపుతోన్న ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వారు కనిపిస్తే.. మీరు చీదరించుకునే బదులు.. వారి సూచనలు పాటిస్తే సరిపోతుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ట్రాన్స్‌జెండర్ల సేవలను వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలిచ్చారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని గుర్తించేందుకు, సిగ్నల్ జంప్ చేయకుండా ఆపడానికి, వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా చూసేందుకు ట్రాన్స్‌జెండర్ల సేవలను ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వీరికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ రూపొందించి.. హోంగార్డుల తరహాలో జీతభత్యాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సెప్టెంబర్లోనే సీఎం ఈ తరహా ప్రతిపాదన చేయగా.. ఇప్పుడు మరోసారి అధికారులను ఆదేశించడంతో.. త్వరలోనే ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకునే విషయంలో అధికారులు కార్యచరణను రూపొందించే అవకాశం ఉంది.
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను ఉపయోగించుకోవడం ద్వారా.. వారికి జీవనోపాధి లభించడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ట్రాన్స్‌జెండర్లు తిడితే మంచిది కాదనే భావన సమాజంలో ఉంది. దీంతో వారు డ్యూటీలో ఉన్న సమయంలో.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులపైనా పనిభారం తగ్గుతుంది. ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన, అవసరమైన శిక్షణ ఇచ్చి.. ట్రాన్స్‌జెండర్లను విధుల్లోకి తీసుకుంటే.. అన్నిరకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జులైలో ట్రాన్స్‌జెండర్ల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రత్యేక క్లీనిక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే వరంగల్‌లో వారి కోసం ప్రత్యేక క్లీనిక్‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వారు ప్రత్యేకంగా వైద్య సేవలు పొందే అవకాశం ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com