కులగణనకు చట్టబద్దత ఉందోలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి డెడికేటెడ్ కులగణన కమిషన్‌కు 35 పేజీలతో తెలంగాణ జాగృతి ఆధ్యర్యంలో చేపట్టిన సమగ్ర నివేదికను కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం బీసీలకు ఎంతో న్యాయం చేసిందన్నారు. కులగణకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద వైఖరిని బీసీలు ఖండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
బీసీ వర్గాలకు జరుగాల్సిన న్యాయం జరుగలేదని, అందుకే అన్ని వివరాలతో డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక ఇచ్చామని అన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రాంతీయ పార్టీలతోనే లబ్ధి జరిగిందన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డీఎన్ఏలో బీసీ, ఎస్సి, ఎస్టీలకు వ్యతిరేకం ఉందని కవిత మండిపడ్డారు. ఇక, బీసీలకు స్థానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ కు కుర్చీ కూడా లేదని, ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని, నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని నిలదీశారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా.. లేదా అనేది ప్రభుత్వం చెప్పాలని, బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, డెడికేటెడ్ కమిషన్ ఇండిపెండెంట్‌గా పని చేయాలని, కమిషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకూడదని, ఇతర బీసీ అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినట్లు బీసీల కోసం పోరాటం చేస్తామని కవిత చెప్పారు.