ఢిల్లీలో అర్థరాత్రి మాయం
ఓ కేంద్రమంత్రితో రాయబారం
ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ అంశంలో చర్చలు
రద్దు చేయకుండా మాజీ మంత్రి విశ్వ ప్రయత్నాలు
మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. లగచర్ల బాధితుల తరుపున మానవ హక్కుల సంఘాన్ని కలిసేందుకు వెళ్లిన కేటీఆర్.. బాధితులతో మాట్లాడిన తర్వాత ఆయన నివాసానికి వెళ్లారు. రాత్రి సమయంలో సెక్యూరిటీని వదిలి.. ఆయన అనుంగ అనుచరుడితో కలిసి మూడు గంటలు బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి.. కేంద్ర ఇంటలీజెన్సీ వర్గాలు సమాచారం అందించాయి. ఈ మూడు గంటలు ఎక్కడకు వెళ్లారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎందుకు వెళ్లారు..?
బీఆర్ ఎస్ కీలక నేత కేటీఆర్ ఢిల్లీ టూర్‌లో కేంద్ర మంత్రులను రహస్యంగా కలుస్తున్నారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే, తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ కేంద్ర మంత్రితో సోమవారం అర్థరాత్రి భేటీ అయినట్లు ఇంటలీజెన్సీ వర్గాలు సమాచారం ఇచ్చాయి. అయితే, ఇటీవల ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణ జరుగుతుండటంతో.. దీనిపై చర్చించినట్లు అనుకున్నారు. ఫార్ములా రేస్ కేసు నుంచి తప్పించుకునేందుకు వెళ్లినట్టు తొలుత ప్రచారం సాగింది. కానీ,
కేటీఆర్ ఢిల్లీ టూర్ అందుకు కాదని, పాస్‌పోర్టు వ్యవహారం కోసం వెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రభాకర్ రావు కోసం..!
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్‌రావు పాస్ పోర్టును శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను తెలంగాణ పోలీసులు కోరారు. అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ప్రస్తావించారు. ఒకవేళ పాస్‌పోర్టును కేంద్రం శాశ్వతంగా రద్దు చేస్తే, అమెరికా పోలీసులే ప్రభాకర్‌రావును ఇండియాకు అప్పగించాలి. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు పోలీసులకు చిక్కాడంటే.. ఫోన్ ట్యాపింగ్ కథ మొత్తం బట్టబయలు అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు గమనించిన కేటీఆర్, నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేయవద్దని, రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వకుండా విదేశీ వ్యవహారాల శాఖకు చెప్పాలని రిక్వెస్ట్ చేసినట్లుగా బీఆర్ ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఒకవేళ పాస్ పోర్ట్ రద్దు చేస్తే.. ప్రభాకర్‌రావు తిరిగి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ ఎస్ కీలక నేతలంతా బయటకు వస్తారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతో కేటీఆర్ కాళ్ల బేరానికి వెళ్లాడని చర్చ. ఈ క్రమంలో కమలానికి అంతర్గతంగా సపోర్టు చేస్తానని, రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేద్దామనే ప్రతిపాదన కూడా పెట్టినట్లు సమాచారం.