సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో సీఎం ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్రంలో నిర్వహించబోయే ప్రజాపాలన విజయోత్సవాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై అధికారులతో ఆయన సమావేశమైన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు విజయోత్సవాలను నిర్వహించడంతో పాటూ మూడు రోజులు పండుగ వాతావారణం కనిపించేలా చూడాలని ఆదేశించారు. ఇదే విషయమై ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కార్యక్రమానికి రావాలని పార్టీ పెద్దలను సీఎం ఆహ్వానించబోతున్నట్టు సమాచారం. దీంతో పాటుగా మంత్రి వర్గ విస్తరణపైనా సీఎం చర్చించే అవకాశాలున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం కులగణన విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కులగణనపైనా ఆయన చర్చలు జరపబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టాణం కులగణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహించే కులగణన దేశానికే రోల్ మోడల్ కావాలని పలుమార్లు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కులగణన జరుగుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలపై పెద్దలతో చర్చించి సూచనలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటూ ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై కూడా సీఎం చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయగా ఎన్నికలు ముగియడంతో మంత్రివర్గ విస్తరణపై కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. పార్టీ పెద్దలతో చర్చల అనంతరం సీఎం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించే ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొంటారు.