Saturday, December 28, 2024

చింతలమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి సహకరించండి

  • బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన గేదెలు వరదల్లో గల్లంతయ్యాయి
  • స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ నేతలు రాత్రికి రాత్రి రహదారి నిర్మించారు
  • 37 వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ
  • ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి భరోసా
  • దివ్యాంగ బాలుడుకి అప్పటికప్పుడే వీల్ చైర్ అందించిన మంత్రి

అమరావతిః విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 37వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో “ప్రజాదర్బార్” కు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు

చింతలమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి సహకరించండి
– దుగ్గిరాల మండలం శృంగారపురానికి చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గ్రామంలోని శ్రీ చింతలమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని, వర్షాకాలంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో నీరు చేరి భక్తులకు అసౌకర్యం కలుగుతోందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేవస్థానం అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

– తాడేపల్లి మండలం కురగల్లుకు చెందిన రాయుడు రాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. కురగల్లు గ్రామానికి చెందిన కట్టెపోగు ఎలీషా, ఆయన కుమారుడు కోటేశ్వరరావు వద్ద 83 సెంట్ల పొలాన్నిరూ.62 లక్షలకు కొనుగోలు చేశానని, అయితే సదరు భూమి నిషేధిత జాబితాలో ఉండటం వల్ల మ్యుటేషన్ నిలిచిపోయిందని వివరించారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారన్నారు. అయితే భూమి విక్రయించిన కట్టెపోగు ఎలీషా మరణించడంతో ఆయన కుమారుడు తనకు రిజిస్ట్రేషన్ చేయకుండా అన్యాక్రాంతం చేసేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
– ఇంజనీరింగ్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని మంగళగిరి మండలం నూతక్కికి చెందిన పోలారెడ్డి జయభరత్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

– విజయవాడకు చెందిన ఉమా చిట్ ఫండ్ ఆస్తులు విక్రయించి డిపాజిట్ దారులను ఆదుకోవాలని నూతక్కికి చెందిన పి.శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. సదరు కంపెనీలో తాను లక్షా 35వేలు డిపాజిట్ చేసి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
– దివ్యాంగుడైన తమ కుమారుడికి వీల్ చైర్ అందించాలని కుంచనపల్లికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మ దంపతులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో అప్పటికప్పుడే నూతన వీల్ చైర్ ను అందించారు. మంత్రి నారా లోకేష్ సాయం పట్ల బాలుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నూతన వీల్ చైర్ లో ఇంటికి తిరిగివెళ్లారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన గేదెలు వరదల్లో గల్లంతయ్యాయి
– ఏలేరు కాలువ ఆధునీకరణ కోసం ఆరేళ్ల క్రితం సేకరించిన తమ 60 సెంట్ల వ్యవసాయ భూమికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పెండ్యాల అమ్మన్న మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాకినాడ ఆర్డీవో కార్యాలయంలో బిల్లు మంజూరు చేశారని, అయితే ఇంతవరకు తమకు నగదు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం జలవనరుల శాఖ నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి నష్టపరిహారం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
– ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేములకు చెందిన రామినేని సురేష్ బాబు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తాను స్థాపించిన మాతృధరణి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కాజేసేందుకు మంగళగిరి నియోజకవర్గం కాజకు చెందిన ఒంటెద్దు వెంకటేశ్వరరావు, కోట మురళీకృష్ణ ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని కూడా ఉందని ఫిర్యాదు చేశారు. కంపెనీ తాలూకా వెల్డింగ్ ఎక్స్ రే ఫిలిమ్స్, రిపోర్ట్స్ ను అపహరించి తనకు బిల్లులు రాకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయడంతో పాటు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

– ఇటీవల సంభవించిన వరదల్లో పెద్దఎత్తున తమ గేదెలు గల్లంతయ్యాయని, ఎంత గాలించినా జాడలేవని, నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. బ్యాంకు రుణం తీసుకుని గేదెలను కొనుగోలు చేశామని, వరదల వల్ల జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– గత వైసీపీ ప్రభుత్వంలో తన స్థలాన్ని కబ్జా చేసి రాత్రికిరాత్రి రోడ్డు నిర్మించారని, పాత రహదారిని పునరుద్ధరించడంతో పాటు తన స్థలాన్ని అన్యాక్రాంతం చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన యాసం వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
– లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని నంద్యాలకు చెందిన కురవ మద్దిలేటి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com