Saturday, November 23, 2024

చూసుకో.. ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా

అందుకే మహారాష్ట్రలో ఘోర పరాభవం .. కేటీఆర్‌

ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలదే హవా అని మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలతో మరోసారి వెల్లడైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల సత్తా కొనసాగుతోంది.. భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని జనం తిరస్కరించడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్ కు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం ఇచ్చే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు తమ తీర్పు ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని కేటీఆర్ అన్నారు.

బ‌లంలేని చోటే మీరు
ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందని కేటీఆర్‌ తెలిపారు. తమ చేతగానితనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే ప్రాంతీయ పార్టీలు చేసిన అభివృద్ధి, వారి ప్రాంతాల కోసం నిబద్దతతో కృషి చేసిన విధానాలపై కూడా కాంగ్రెస్, బీజేపీ లు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసిన ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

ప్రజల కోసం పనిచెయ్ రేవంత్…
మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని మీరు చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదని అన్నారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సలహా ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular