Friday, November 8, 2024

జమ్మూ కశ్మీర్‌లో పంజా విసిరిన ఉగ్రవాదులు

అఖ్నూర్ సెక్టార్‌లో సైనిక వాహనంపై కాల్పులు
సైన్యం అప్రమత్తం కావడంతో పారిపోయిన ఉగ్రవాదులు
ముష్కరుల కోసం గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. సైనిక వాహనమే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అఖ్నూర్ సమీపంలో సైనిక వాహనంపై పలు రౌండ్ల పాటు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. సైన్యం రాకతో ఉగ్రవాదులు అక్కడ నుంచి పరారైనట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అఖ్నూర్ ఉగ్రదాడిపై ఆర్మీకి చెందిన వెట్ నైట్ కార్ప్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అఖ్నూరు సుందర్‌బని సెక్టార్‌లోని అసన్ సమీపంలో సైనిక కాన్వాయ్‌పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.. ఈ దాడిని సమర్ధంగా తిప్పికొట్టిన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది.. ఘటనలో సైనికులు ఎవరూ గాయపడలేదు.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది.. చుట్టుపక్కల ముమ్మరంగా గాలిస్తున్నారు ’ అని ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఈ ఘటన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల ఉగ్రవాదుల వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు సైనికులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లా జిల్లాలో గత గురువారం రాత్రి ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి మూడు రోజుల ముందు సోన్ మార్గ్ సొరంగం వద్ద కార్మికుల క్యాంప్‌లోకి చొరబడి కాల్పులు జరిపారు . ఈ ఘటనలో ఓ డాక్టరు, ఆరుగురు కార్మికులు సహా ఏడుగురు చనిపోయారు. ఇటీవల నెలల్లో పౌరులపై జరిగిన అత్యంత పాశవిక ఉగ్రదాడి ఇదే. ఇదిలా ఉండగా, పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరిగి.. ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular