Sunday, November 17, 2024

టిజిఎంఎస్‌ఐడిసిలో అవినీతి తిమింగలం..?

డిప్యూటేషన్ వచ్చి ఆ శాఖ ఉద్యోగులను బయటకు పంపించి…

టిజిఎంఎస్‌ఐడిసిలో అవినీతి తిమింగలం..

మూడేళ్లుగా కోట్లలో అవినీతి దందా..!

ఎన్‌హెచ్‌ఎం, సిఎంఓకు ఫిర్యాదుల వెల్లువ

ఈ అధికారి నిర్వాకంతో స్టోర్‌రూంలో మూలకుపడ్డ డ్రగ్స్

అధిక ధరకు ఫర్నీచర్, మందుల కొనుగోళ్లు

టిజిఎంఎస్‌ఐడిసిలో జరుగుతున్న అవినీతి కుంభకోణంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఈడీ స్థాయి అధికారి మూడేళ్లుగా చేస్తున్న అవినీతిపై ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్), సిఎంఓకు పలువురు ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులు ఫిర్యాదులు రావడం విశేషం. దీనిపై సిఎంఓ అధికారులు సైతం విచారణ చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. టిజిఎంఎస్‌ఐడిసిలో పనిచేయడానికి మూడేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై ఈ అధికారి ఇక్కడకు వచ్చారని, ఆయన మూడేళ్లుగా చేస్తున్న అవినీతిపై ఆధారాలతో సహా కొందరు ఈ ఫిర్యాదులు చేసినట్టుగా సమాచారం. మూడు నెలల క్రితం ఆ అధికారిని ఆరోగ్య శ్రీకి బదిలి చేసినా అక్కడకు వెళ్లకుండా ఫైరవీ చేసుకొని టిజిఎంఎస్‌ఐడిసి నుంచి కదలకపోవడం విశేషం. ఇలా ఆ అధికారి చేస్తున్న అవినీతికి అంతేలేదని, ఇప్పటికైనా ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించకపోతే మరిన్ని ప్రభుత్వ నిధులు స్వాహా అవుతాయని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ అధికారి వేధింపులతో ఈ సంవత్సరంలో ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధుల నుంచి తప్పించారని ఆయన అవినీతిని ప్రశ్నించినందుకే వారిని తొలగించేలా ఈ అధికారి చక్రం తిప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన అవినీతి బయటపడకుండా టిజిఎంఎస్‌ఐడిసికి చెందిన ఉద్యోగులను వేరే సంస్థకు బలవంతంగా డిప్యూటేషన్‌పై పంపించారని ఈ సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. ఇలా ఈ అధికారి అవినీతి లీలలు చెప్పుకుంటే చాలా ఉన్నాయని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు పేర్కొనడం విశేషం.

టెండర్ లేకుండానే స్ట్రిప్స్

ఈ అధికారి ఎంత చెబితే అంత అన్నట్టుగా ఈ సంస్థలో జరుగుతోందని ఉన్నతస్థాయి అధికారులు సైతం ఆయన మాటనే వింటారని, ఆయన చెప్పిన చోట సంతకాలు పెడతారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అధికారి మూడేళ్లుగా చేస్తున్న అవినీతిలో డ్రగ్స్, ఫర్నీచర్, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ సంస్థలో సివిల్ వర్క్ తప్ప అన్నింటిలో ఈ అధికారి చెప్పిన వారికే టెండర్‌లను కేటాయించడం, ముడుపులు ఇచ్చిన వారికే ఈ సంస్థకు చెందిన పనులను అప్పగించడం లాంటివి ఈ అధికారి కనుసన్నల్లోనే జరుగుతాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెసిఆర్ కిట్‌లు, కంటివెలుగు 2 (కంటి అద్దాలు), టిపా స్కాన్ మిషన్‌లు, ఫర్నీచర్, మందుల కొనుగోళ్లలో ఈ అధికారి భారీగా అవినీతి పాల్పడ్డారని, మూడునెలల క్రితం హిమోగ్లోబిన్ స్ట్రిప్స్ కొనుగోళ్లలోనూ టెండర్ లేకుండానే పాత టెండర్‌దారులకు కట్టబెట్టారని గతంలో (2022లో) టెండర్ దక్కించుకున్న సంస్థకు మేలు చేసేలా ఈ అధికారి వ్యవహారించారని ఆరోపిస్తూ కొందరు ఈ అధికారిపై ఎన్‌హెచ్‌ఎంకు (కేంద్రానికి) ఫిర్యాదు చేయడం విశేషం.

50 టిఫా స్కాన్ మిషన్‌లు, అద్దాల పంపిణీలోనూ….

గర్భిణీల కోసం కొనుగోలు చేసిన 50 టిఫా స్కాన్ మిషన్‌ల కొనుగోళ్లలోనూ ఈ అధికారి చేతివాటం చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల కోసం ఈ మిషన్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. గర్భిణుల కడుపులో బిడ్డ ఎదుగుదలను తెలుసుకోవడానికి దీనిని వినియోగిస్తారు. అయితే ఈ మిషన్‌ల కొనుగోళ్లలోనూ తక్కువ ధర టెండర్‌లు వేసిన వారిని కాదనీ వేరే కంపెనీలకు ఈ టెండర్‌లు ఇప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో మిషన్ ధర రూ.29 లక్షలు ఉంటుందని టెండర్‌ల కేటాయింపులో భారీగా అవినీతి జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, కంటివెలుగు2 (అద్దాలకు సంబంధించి), కెసిఆర్ కిట్‌లోనూ ఈ సార్ చేతివాటం చూపించారని కోట్లలో అవినీతికి పాల్పడ్డారని, దీనిపై ఆ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తే వారిని వేరే శాఖకు డిప్యూటేషన్‌పై పంపించారని తెలుస్తోంది.

25 మెడికల్ కాలేజీలకు ఫర్నీచర్ కొనుగోళ్లలో…

ఇక, 25 మెడికల్ కాలేజీలకు ఫర్నీచర్ కొనుగోళ్లు, టెండర్‌ల కేటాయింపులోనూ ఈ అధికారి ఏకపక్షంగా వ్యవహారించారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించి రూ.100 కోట్లకు కొనుగోళ్లకు సంబంధించి ఆర్డర్ జరగ్గా అందులో ఆయన వాటా కోట్లలో ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏదైనా పరికరాలు, మందులు కొనుగోలు చేయాలన్నా, టెండర్ వేసే కంపెనీలకు బిడ్డింగ్ ఓకే చేయాలన్న ముందుగా ఈ అధికారి ఓకే అంటేనే వారి పని అవుతుందని, లేకపోతే కనీసం వారు టిజిఎంఎస్‌ఐడిసి పరిసరాల్లోకి రాకుండా చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

11 సిటీ స్కాన్ మిషన్‌ల కోసం…

దీంతోపాటు 11 సిటీ స్కాన్ మిషన్‌లను కొనుగోళ్లను కూడా ఈ అధికారే పర్యవేక్షించారని, ఈ 11 మిషన్‌లకు సుమారుగా రూ.2 కోట్ల 80 లక్షలు వెచ్చించగా ఇందులోనూ భారీగా అవకతవకలు జరిగాయని తెలిసింది. ఇందులో 8 మిషన్‌లు డిఎంఈకి, 3 మిషన్‌లు టివివిపి ఆస్పత్రులకు పంపించారు.

స్టోర్‌రూంలో వృధాగా మందులు

టిజిఎంఎస్‌ఐడిసి ఆధ్వర్యంలో మందులను కొనుగోలు చేసి పిహెచ్‌సీ, సిహెచ్‌సి, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, మెడికల్ కాలేజీలకు పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ మందుల కొనుగోళ్లకు సంబంధించి ఈ అధికారి చేసిన నిర్వాకం వల్ల ప్రస్తుతం స్టోర్‌రూంలో ఎవరికి పనిరాకుండా మూలనపడి ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు, రోగులకు ఉపయోగపడని మందులను తక్కువ ధరకు తెప్పించి ఆయా కంపెనీల నుంచి భారీగా ఈ అధికారి లబ్ధిపొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారి నిర్వాకం వల్ల సుమారుగా రూ.100ల కోట్ల విలువ చేసే మందులు వృధాగా పడి ఉండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోటి 10 లక్షల 20 వేల హిమోగ్లోబిన్ స్ట్రిప్స్

దీంతోపాటు హిమోగ్లోబిన్ స్ట్రిప్స్ కొనుగోళ్లకు సంబంధించి ఈ అధికారి గతంలో టెండర్ వేసిన వారికే లబ్ధి చేకూర్చారని, 2022లో వేసిన టెండర్ ఆధారంగానే ప్రస్తుతం వారికే మరోసారి వారికి ఈ టెండర్‌లను కట్టబెట్టి వారికి లబ్ధి చేకూర్చారని, దీనివల్ల ఎన్‌హెచ్‌ఎంకు నష్టం వచ్చిందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నాయి. అయితే ఈసారి సుమారుగా కోటి 10 లక్షల 20 వేల హిమోగ్లోబిన్ స్ట్రిప్స్‌ను ఈ అధికారి కొనుగోలు చేయించారని ధర కూడా రూ.7.50లు వెచ్చించారని, రెండు లేదా మూడు రూపాయలకు దొరికే ఈ స్ట్రిప్స్‌కు అధిక ధర చెల్లించారని, దీనిపై విచారణ చేయాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular