ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్యను పోలీసులు గురువారం విచారించారు. విచారణ అనంతరం లింగయ్య మీడియాతో మాట్లాడారు. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్ పైన పోలీసులు విచారణ చేశారని వెల్లడించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తనకు తెలిసిన అధికారి కావడంతో తాను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న తో మాట్లాడినట్లు చెప్పానన్నారు. ఆ తర్వాత మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడడని, వారి ఇద్దరి ఫోన్ నంబర్ల తమన అనుచరుల దగ్గర నుంచి తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి ఇచ్చానన్నారు. అప్పుడే ఈ నంబర్లు ఎందుకని తిరుపతన్న ను ప్రశ్నించానని చెప్పినట్లు లింగయ్య తెలిపారు. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తిరుపతన్నపలుమార్లు అడిగాడని, ప్రచారం బాగా జరుగుతుందని తాను ఫోన్లో మాట్లాడానన్నారు. కాగా, వేముల వీరేశం అనుచరుల ఫోన్ టాప్ చేశాననేది అవాస్తవం అని, కుట్రపూరిత ఉద్దేశంతో కొంతమంది తనపై కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా తాను పోలీసులకు సహకరిస్తానని, ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే విచారణ కోసం పోలీసులు పిలిచారని, పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే విచారించారని మాజీ ఎమ్మెల్యే లింగయ్య చెప్పారు.