విజయనగరం ఐసిస్ ఉగ్రమూలాల కేసు విచారణలో నింధితులు ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టెర్రరిస్ట్ సిరాజ్‌కు సోషల్ మీడియాలో ఓ రెవెన్యూ ఉద్యోగి పరిచయం అయ్యాడు. రాజాసింగ్ వీడియోపై వారిద్దరూ చాట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విజయనగరం ఈ ఐసిస్ ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సిరాజ్, సమీర్‌లను పోలీసులు 2 రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సిరాజ్‌ను ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ చేసిన వ్యాఖ్యలకు ఆ వ్యక్తి స్పందించి, ప్రశంసించాడు. అతను రెవెన్యూ అధికారిగా గుర్తించారు పోలీసులు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని కూపీలాగుతున్నారు.
విజయనగరం పోలీసు ట్రెయినింగ్ అకాడమీలో శనివారం 7 గంటల పాటు విచారణ జరిగింది. టెర్రరిస్టులు సిరాజ్, సమీర్‌లు ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల అనుమానిస్తారు. అందులో అధికారి పాత్రపై దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో రాజాసింగ్‌పై పెట్టిన వీడియోతో ఆ రెవెన్యూ అధికారి సిరాజ్‌కు పరిచయం అయ్యాడు. సిరాజ్‌ను మెచ్చుకుంటూ అతడికి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత వారి మధ్య చాటింగ్ మొదలైంది. కొంతకాలానికి ఆ వ్యక్తి తన వివరాలు సిరాజ్‌కు చెప్పాడు. తాను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు.
పేలుళ్లకు కుట్ర
ప్రధాన నగరాల్లో బాంబ్ పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం జిల్లాకు చెందిన సయ్యద్ ఉర్ సిరాజ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ లను అరెస్ట్ చేశారు విజయనగరం జిల్లా పోలీసులు. తెలంగాణ, ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు, విజయనగరం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఏడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో సిరాజ్, సమీర్ లను విచారిస్తున్నారు విచారణ బృందం. కాగా, సిరాజ్ అరెస్ట్ తో విజయనగరం జిల్లా ఉలిక్కిపడింది. అసలు ఈ సిరాజ్ ఎవరు? ఉగ్రవాదభావజాలం వైపు ఎలా వెళ్లాడు? ఎవరెవరితో పరిచయాలున్నాయి అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. విజయనగరం జిల్లాలో ఉగ్ర లింక్స్ వ్యవహారంతో జిల్లావాసులు భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల కుట్ర కేసులో కీలక సూత్రధారి సిరాజ్ అని గుర్తించారు పోలీసులు.
ఇంతకీ ఎవరీ సిరాజ్? అని విజయనగరం జిల్లావ్యాప్తంగా సర్వత్రా చర్చ నడుస్తుంది. సిరాజ్ ఉర్ రెహమాన్ మొదటి నుండి ముస్లింమత భావజాలంతో ఆవేశపూరిత వ్యక్తిత్వం గల వ్యక్తిగా కుటుంబసభ్యులు చెప్తున్నారు. సిరాజ్ జిల్లాలోనే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐగా పనిచేస్తుండగా, సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. తన అన్న, తండ్రులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండటంతో సిరాజ్ కూడా పోలీస్ అవుదామని అనుకున్నాడు. అందుకోసం కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల కోసం పలు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు. అనంతరం గ్రూప్ వన్ కోచింగ్ తీసుకునే నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే 108 కాల్ సెంటర్ లో ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తున్న క్రమంలో పలువురు ఇస్లామిక్ యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా తనకు దగ్గరగా ఉన్న భావజాలం కలిగిన ఇరవై మంది యువకులను ట్రాప్ చేశాడు. ఆ ఇరవై మందితో కలిసి ఆల్ హింద్ ఇత్తెదుల్లాహ మిషిలిన (ఆహిం) అనే ఒక ఒక ఇన్ స్టా, టెలి గ్రామ్ గ్రూప్స్ ఏర్పాటు చేశాడు. ఆ తరువాత నిత్యం ఆ గ్రూప్స్ లో చాటింగ్ ద్వారా జిహాదీపై పలు బోధనలు చేసి వారిని మతోన్మోదులుగా మార్చాడు. తమ భవిష్యత్ కార్యాచరణకు బాటలు వేసుకున్నారు.
ముందుగా బాంబులు ఎలా తయారుచేయాలి? పేలుళ్ల ముడి పదార్థాలు ఎక్కడ తయారు చేయాలి? అందుకు కావలసిన నిధులు పరిస్థితి ఏంటి? అనే అనేక విషయాలు తెలుసుకొని గ్రూప్ ద్వారా స్నేహితులతో చర్చించేవాడు. ఆ గ్రూప్ లో సిరాజ్, సమీర్ లు యాక్టివ్ గా ఉండేవారు. వారిలో సిరాజ్ పేలుళ్ల కోసం కావలసిన బాంబులు తయారుచేసేందుకు ముడి పదార్థాలు అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టి విజయనగరంలో కొనుగోలు చేశాడు. ప్రశాంత జిల్లాలో తన యాక్టివిటీస్ ఏం చేసినా పెద్దగా నిఘా ఉండదని విజయనగరాన్ని సేఫ్ ప్లేస్ గా ఎంచుకొని తన కార్యకలాపాలు మొదలుపెట్టాడు. అయితే సిరాజ్ కదలికలపై దృష్టి సారించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పక్కా సమాచారంతో సిరాజ్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి కోర్టు అనుమతితో ఏడు రోజులు కస్టడీకి తీసుకొని మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో విజయనగరం జిల్లావాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.