మా డిమాండ్‌లను పరిష్కరించాకే కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించాలి
బార్ యజమానుల కొత్త ప్రతిపాదన
ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఎక్సైజ్ శాఖ మంత్రులకు వినతి
కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్‌లో అమల్లోకి రానున్న నేపథ్యంలో బార్‌ల యజమానులు పలు డిమాండ్‌లను తెరపైకి తీసుకొస్తున్నారు. గత కొన్నేళ్లుగా వైన్‌షాపులకు పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు డిమాండ్‌లను ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఎక్సైజ్ శాఖ మంత్రి ముందుంచారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్‌షాపులు ఉండగా, 1171 బార్‌లు+పబ్‌లు+ఎలైట్ బార్‌లు ఉన్నాయి. శంషాబాద్‌లో అధికంగా 152 బార్‌లు ఉండగా, హైదరాబాద్‌లో 136, మల్కాజిగిరిలో 115, సరూర్‌నగర్‌లో 98, మేడ్చల్‌లో 94, సికింద్రాబాద్‌లో 85 బార్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో నూతన ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకొస్తే దానికి సంబంధించిన కొత్త విధానాలను ఏమైనా ఉంటే ముందే వాటిని ప్రకటించాలని, సెప్టెంబర్‌లో బార్‌ల రెన్యువల్‌ను చేసుకున్న తరువాత ఈ కొత్త విధానాలను ప్రకటిస్తే తాము నష్టపోయే అవకాశం ఉందని బార్‌ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి కొత్త పాలసీని ప్రకటించిన తరువాతే…
2014 సంవత్సరం కన్నా ముందు బార్‌ల రెన్యువల్ కన్నా ముందే నూతన పాలసీని అప్పటి ప్రభుత్వం ప్రకటించేదని దీనివల్ల ఇష్టమున్న వారు మాత్రమే బార్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకునే వారని దానివల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేవారమని వారు పేర్కొంటున్నారు. 2014 నుంచి బార్‌ల లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్న తరువాత ఈ కొత్త మద్యం పాలసీని ప్రకటిస్తున్నారని దీనిని ఈసారి మార్చాలని వారు తెరపైకి ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.
రాత్రి 10 గంటల వరకే వైన్‌షాపులను మూసివేయాలి
దీంతోపాటు అన్ని జిల్లాలోనూ వైన్‌షాపులను రాత్రి 10 గంటల వరకు, హైదరాబాద్ పరిధిలో రాత్రి 11 గంటల వరకు నడుపుకునేలా గతంలో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనివల్ల బార్‌లకు నష్టం వాటిల్లుతుందని, హైదరాబాద్‌లోనూ 10 గంటల వరకే వైన్‌షాపులను మూసివేసేలా ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైన్‌షాపుల పర్మిట్ రూంలకు సంబంధించి జిఓ 25, 26లకు అనుగుణంగా నిబంధనలను వైన్‌షాపు యజమానులు పాటించడం లేదని బార్‌ల యజమానులు ఆరోపిస్తున్నారు. పర్మిట్ రూంలలో ఎలాంటి తినుబండరాలు, బెంచీలు, కుర్చీలు లేకుండా ఉండాలన్న నిబంధనలను సైతం వైన్‌షాపు యజమానులు పట్టించుకోవడం లేదని దీనివల్ల బార్లకు ఆదాయం పడిపోయిందని బార్‌ల యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ లేకుండా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఫీజును పెడితే తమకు బ్యాంకు లోన్ కూడా వస్తుందని, ప్రతి సంవత్సరం రెన్యువల్‌ను పెట్టడం వల్ల బ్యాంక్ నుంచి లోన్ రావడం లేదని దీనిపై ఎక్సైజ్ శాఖ పునరాలోచించాలని వారు సూచిస్తున్నారు.
5 వేల ఎస్‌ఎఫ్‌టికి రూ.40 లక్షల వసూలు
దీంతోపాటు గతంలో ప్రభుత్వం సెలవులను ప్రకటిస్తే తాము కట్టిన ఫీజులో నుంచి ఆయా రోజులకు డబ్బులను ఎక్సైజ్ శాఖ చెల్లించేదని ప్రస్తుతం ఇది అమల్లో లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు 15వ తేదీ, జనవరి 26వ తేదీ, అక్టోబర్ 02వ తేదీన ప్రకటించే సెలవులతో పాటు హనుమాన్ జయంతి, గణేశ్ నిమజ్జనం, బోనాల పండుగలకు కూడా బార్‌లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుండడంతో దానికి సంబంధించిన డబ్బులను ఇప్పించాలని వారు సూచిస్తున్నారు. దీంతోపాటు 5 వేల ఎస్‌ఎఫ్‌టి ఉన్న బార్‌లకు రూ.40లక్షల ఫీజును ఎక్సైజ్ శాఖ వసూలు చేస్తుండగా దానిని 7 వేల ఎస్‌ఎఫ్‌టికి పెంచి రూ.40లక్షల ఫీజును వసూలు చేయాలని, గతంలో రూ.31 లక్షలు ఉన్న ఈ ఫీజును ప్రస్తుతం రూ.40 లక్షలుగా వసూలు చేస్తున్నారని దీని గురించి ఎక్సైజ్ శాఖ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.