విజయవాడః ప్రజలు మీకు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఐదు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దీంతో వైఎస్ షర్మిల అన్న జగన్ తీరును కాంగ్రెస్ పార్టీ స్టేట్ అధ్యక్షురాలిగా తప్పుబట్టారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు.
”ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది జగర్‌తీరు” అని ఆమె ఎద్దేవ చేశారు. బడ్జెట్ బాగోలేదని రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదని వైసీపీ కంటే ముందుగా విలేఖరుల సమావేశంలో చెప్పింది మేము. జగన్ తిరిగి మళ్ళీ అవే మాటలను విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. దీంతో మీకు మాకు పెద్ద తేడా ఏముందని ఆమె అన్నారు. జగన్‌కి 38శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్ళనప్పుడు మీకు మాకు పెద్ద తేడా ఏముందన్నారు. అదే విధంగా సొంత మైకుల ముందు మాట్లాడటం కాదని అసెంబ్లీ మైకుల ముందు ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడాలన్నారు.
చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయాలన్నారు. 11 మందితో ప్రతిపక్ష హోదా లభించకపోయినప్పటికీ అసెంబ్లీకి వచ్చి చర్చలు జరిపిమరీ ప్రతిపక్షం అనిపించుకోవాలి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుందని ఆమె ట్వీట్ చేశారు.