- గంజాయి మూలాలు ధూల్‌పేట్‌లోనే బయటపడుతున్నాయి
- ఆగష్టు 31వ తేదీలోపు ధూల్‌పేట్‌ను
- గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని ముందుకెళుతున్నాం
- సీతాఫల్ మడి, మైలారం గడ్డ, చిలుకలగూడలో నిల్వ చేసిన
- 54 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం
- మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా 1,000 మంది పోలీసులకు శిక్షణ
- ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఎక్సైజ్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకున్నారని వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 54 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టుబడిన గంజాయి మూలాలు ధూల్‌పేట్‌లోనే బయట పడుతున్నట్లు ఆయన చెప్పారు. ఆగష్టు 31వ తేదీలోపు ధూల్‌పేట్‌ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. గంజాయి ఆపరేట్ చేసే వాళ్ళు అండర్ గ్రౌండ్ కెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. విశాఖపట్నం నుంచి గంజాయి దిగుమతి చేస్తూ కావాల్సిన వాళ్లకు గంజాయి సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు. సీతాఫల్ మడి, మైలారం గడ్డ, చిలుకలగూడలో నిల్వ చేసినట్టు విచారణలో తేలిందని దీంతో ఏకకాలంలో దాడులు చేసి 54 కేజీల గంజాయిని పట్టుకున్నామని ఆయన తెలిపారు.
సిఎం ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు కృషి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని కమలాసన్ రెడ్డి తెలిపారు. కొన్ని రోజులుగా మాదకద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ధూల్‌పేట్‌లో గతంలో నాటు సారా తయారయ్యేదని, దానిని పూర్తిగా నియంత్రించామని, ప్రస్తుతం దాని స్థానంలో ధూల్‌పేట్ గంజాయి హబ్‌గా మారిందని ఆయన చెప్పారు.
ధూల్‌పేట్‌లో పట్టుబడింది 15 మంది నిందితులు
కొద్దిరోజులుగా ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నట్లు కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ధూల్‌పేట్ జరిపిన సోదాల్లో 15 మంది నేరస్థులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ధూల్‌పేట్‌లో బయట పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా 1,000 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.
పట్టుబడ్డ నిందితులకు శిక్షలు పడే విధంగా
పట్టుబడ్డ నిందితులకు శిక్షలు పడేవిధంగా తమ వంతు కృషి చేస్తామని, అందులో భాగంగా ఈ కేసును విచారణ చేపడుతున్నామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. అక్కడే కాకుండా సమాంతరంగా మిగతా ప్రాంతాలపై కూడా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు సోదాల్లో భాగంగా పోలీసులు, నార్కోటిక్ బ్యూరో పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.