` కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి“ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. లగచర్ల దాడి ఘటన కేసులో ప్రభుత్వం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కేటీఆర్ పేరును సైతం ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలు ఉన్నాయని.. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ తీవ్రంగా స్పందించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అంటూ ప్రశ్నించారు.
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా అని ధ్వజమెత్తారు. ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర అని మండిపడ్డారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించారని, మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టారని, ఫైర్ అయ్యారు. 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? అంటూ ఘాటుగా స్పందించారు. తనను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసునని.. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానన్నారు. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి.. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.