Friday, February 14, 2025

ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్

రూ.కోట్ల విలువైన రిసార్టులపై హైడ్రా ఉక్కుపాదం

నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా… ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. ప్రజాప్రతినిధులు అడ్డు వచ్చినా, హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందాలని చూసిన అన్ని ఆధారాలతో హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. తాజాగా.. మేడ్చెల్ – మ‌ల్కాజిగిరి జిల్లాలోని తూముకుంట‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లాయి. ఇక్కడి.. దేవ‌ర‌యాంజ‌ల్ గ్రామంలోని కోమ‌టి కుంట‌లో నిర్మించిన అక్రమ కట్టాడాలను గుర్తించి కూల్చివేసింది.

రాష్ట్రంలోని నీటి వనరులు, కాలువలు, మురుగునీటి కాల్వలపై అడ్డుగా నిర్మించిన కట్టాడాలపై హైడ్రా ఏ దశలోనూ కనికరం చూపించడం లేదు. ప్రభుత్వ, ప్రజావసరాల భూముల్లోని అక్రమాలను తన పరిశీలనలో గుర్తించినా, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ద్వారా తెలుసుకున్నా.. తక్షణమే చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా.. కోట్లుపెట్టి నిర్మించిన రిసార్టులను సైతం నిర్దాక్షణ్యంగా తొలగించి వేసింది. కోమటికుంటలోని ఎఫ్ టీఎల్ పరిధిలో అక్రమంగా భూముల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన హైడ్రా అధికారులు.. కమిషనర్ రంగనాథ్ నుంచి అనుమతి రాగానే.. నిర్మాణాలను కూల్చేశారు.

కోమటికుంటలోని ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ పేరుతో భారీ నిర్మాణాలను చేపట్టారు. వీటిని అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నట్లు చూపించారు. కానీ.. ఎలాంటి లేకపోగా, అన్నీ నకిలీ అనుమతులతో అధికారుల్ని, స్థానికుల్ని అదరగొడుతున్నారు. ఇదే విషయమై హైడ్రా అధికారులకు సమాచరం అందించడంతో.. క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించిన అధికారులు.. ఇరిగేష‌న్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల‌తో పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టింది. ఆయా అధికారులు ఇచ్చినట్లు చెబుతున్న అనుమతులు, ప్రభుత్వ రికార్డుల్లోని కుంట విస్తీర్ణం, సాంకేతికంగా సేకరించిన కుంట వాస్తవ పరిధిని పరిగణలోకి తీసుకుని, అక్రమణలు జరిగినట్లు గుర్తించారు. కోమ‌టి కుంట చెరువు ప‌రిధిలో నిర్మించిన ప్ర‌కృతి రిసార్ట్స్‌, ప్ర‌కృతి క‌న్వెన్ష‌న్ కు ఎలాంటి నిర్మాణ అనుమ‌తులు లేవ‌ని తేల్చిన అధికారులు.. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోకి వచ్చే నిర్మాణాలను కూల్చి వేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

హైడ్రా చర్యలను తక్షణమే నిలిపివేయాలంటూ ప్ర‌కృతి రిసార్ట్స్‌, ప్ర‌కృతి క‌న్మెన్ష‌న్ ప్ర‌తినిధులు హైకోర్టును ఆశ్ర‌యించారు. తామ నిర్మాణాలు చట్టబద్ధమైనవేనని, కూల్చివేసేందుకు అనుమతి ఇవ్వద్దంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ పై ఇరిగేష‌న్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖల అధికారులు ఇచ్చిన నివేదిక‌లను హైకోర్టుకు సమర్పించిన హైడ్రా.. ఆ నిర్మాణాలు అక్రమం అని వాదించింది. హైడ్రా అధికారులతో అంగీకరించిన న్యాయస్థానం.. కోమటికుంటలోని ప్రకృతి నిర్మాణాల్ని వెంటనే కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. రంగంలోకి దిగిన అధికారులు, నిర్మాణాల్ని కూల్చివేశారు.

హైకోర్టు తీర్పుతో కంగుతిన్న ప్రకృతి రిసార్ట్స్ ప్రతినిధులు.. తమ నిర్మాణాల్ని తామే కూల్చివేస్తామని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. దాంతో.. ఎఫ్ టీఎల్ లోని నిర్మాణాల కూల్చివేతకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రకృతి రిసార్ట్స్ ప్రతినిధులు నిర్మాణాలను కూల్చివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. హైడ్రా అధికారులు కూల్చివేతలకు పూనుకున్నారు. తమ బుల్డోజర్లను పంపించి, నిర్మాణాల్ని కూల్చివేశారు. పక్కా ఆధారాలు, సాంకేతిక సమాచారంతో అక్రమార్కులను వదిలి పెట్టకుండా హైడ్రా వ్యవహరిస్తున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. దానికి నిర్దేశించిన లక్ష్యాల్ని, పనుల్ని కచ్చితంగా నిర్వహించడంపై అభినందనలు తెలుపుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com