Friday, October 18, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

  • తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు
  • తడ వద్ద తీరం దాటిన వాయుగుండం
  • విశాఖ, కాకినాడ తీరాల్లో భారీగా ఎగసిపడుతున్న అలలు

రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీరం దాటిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దక్షిణ కోస్తాంధ్రకు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడి అల్పపీడనం గా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది.

అంతేకాదు ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ రాబోయే ఐదురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడేందుకు అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తడ వద్ద తీరం దాటిన వాయుగుండం : వాయుగుండం తీరం దాటాక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలు వాయుగుండం తీవ్రతకు భారీగా నష్టపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో ఇళ్లు కోతకు గురయ్యాయి. సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పరిస్థితిపై కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది. అనంతరం అల్పపీడనంగా బలహీనపడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు తీర ప్రాంత, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

విశాఖ, కాకినాడ తీరాల్లో భారీగా ఎగసిపడుతున్న అలలు : వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల జనజీవనం స్తంభించింది. విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాలను తాకుతున్నాయి. వర్షానికి పెదగంట్యాడ మండలం కొంగపాలెంలో రేకుల షెడ్డు కూలింది. దీంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. చెట్లు, విద్యుత్, స్తంభాలు, ఇళ్లు నేల కూలాయి. అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గోదావరి సంగమం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. పల్లిపాలెంలో ఇళ్లు, బీచ్ రోడ్డును అలలు ముంచెత్తాయి. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. ఓఎన్‌జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది. ఆక్వా చెరువులను సముద్రం నీరు ముంచెత్తింది.

1700 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు : ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వర్షాలకు సజ్జ రైతులు నిండా మునిగారు. కనిగిరి, వెలిగండ్ల, చంద్రశేఖరపురం మండలాల్లో 17వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వైఎస్సార్ జిల్లా పెద్దముడియంలో కుందూ నది ఉద్ధృతితో గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ముద్దనూరు మండలంలో పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. చిన్నకత్తెరపల్లెలో మట్టిమిద్దె కూలింది. ఎగువ నుంచి వరద రావడంతో సిద్ధవటం వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వరి నారుమళ్లు నీళ్లలోనే నానుతున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో నెల్లూరు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొన్నిచోట్ల పొలాలు నీటిలోనే ఉన్నాయి. వర్షంతో సోమశిల జలాశయం జలకళ సంతరించుకుంది. కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండో పంటకు సాగునీటి సమస్య రాదని రైతులు అంటున్నారు. ఆత్మకూరు, నెల్లూరు గ్రామీణం, కోవూరు నియోజకవర్గాల్లోని జగనన్న కాలనీల్లోకి నీరు చేరింది.

జలాశయాలకు చేరుతున్న వరద : శ్రీసత్యసాయి జిల్లా సి.కె.పల్లి మండలం వెల్దుర్తి సమీపంలో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వెల్దుర్తి, గంగినేపల్లి తండాలకు, ఎర్రోనిపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నప్పరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో గండికోట జలాశయం, మైలవరం జలాశయాలకు వరద నీరు వచ్చి చేరతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. నెల్లూరు నగర శివారులోని ఆటోనగర్, చంద్రబాబు నగర్, తల్పగిరి కాలనీ, జొన్నవాడ రోడ్డు, పొట్టేపాలెం కలుజు ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షానికి పంట తడిసింది. ఆరబోసిన మొక్కజొన్న, వేరు శనగ తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి నీటమునిగింది.

వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష : రాష్ట్రంలో భారీవర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు ఆయనకు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను అధికారులు వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు అన్న మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular