Sunday, April 13, 2025

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా డ్రైపోర్ట్

* ఆర్ఆర్ఆర్ ప‌నులు వేగ‌వంతం చేయాలి..
* ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి..
* ఆర్ఆర్ఆర్‌, ఎన్‌హెచ్‌ల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆర్ఆర్ఆర్ స‌మీపంలో స‌రైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాల‌ని సీఎం అన్నారు. రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం… ఆర్ఆర్ఆర్ ప‌నుల పురోగ‌తిపై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఇటీవ‌ల రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న అంశాల‌పై ఢిల్లీలో జ‌రిగిన తెలంగాణ‌, ఏపీ అధికారుల స‌మావేశంలో హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి ఆదేశించిన నేప‌థ్యంలో ఆ ప‌నుల‌పై దృష్టిసారించాల‌ని సీఎం సూచించారు. రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి సంబంధించిన‌ భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని, ద‌క్షిణ భాగం డీపీఆర్ క‌న్స‌ల్టెన్సీ నివేదిక‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ ర‌హ‌దారికి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసి జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థకు (ఎన్‌హెచ్ఏఐ) పంపించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

హైద‌రాబాద్ నుంచి మంచిర్యాల వ‌ర‌కు కొత్త జాతీయ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేయాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌లో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై సీఎం ఆరాతీశారు. ప‌లు చోట్ల పంట‌లు ఉన్నాయ‌ని, పంట న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్ఏఐ అంగీక‌రించ‌డం లేద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. పంట కాలం దాదాపు పూర్త‌వుతున్నందున ఆ వెంట‌నే రైతుల‌తో మాట్లాడి భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

భూ సేక‌ర‌ణ‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లుంటే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడాల‌ని, సాంకేతిక‌, న్యాయ స‌మ‌స్య‌లు ఉంటే వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. ఔట‌ర్ రింగు రోడ్డు నుంచి రీజిన‌ల్ రింగు రోడ్డు వ‌ర‌కు రేడియ‌ల్ రోడ్లు.. ఆర్ఆర్ఆర్‌ నుంచి తెలంగాణ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌పైనా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సీఎం అన్నారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి హ‌రిచంద‌న‌, ముఖ్య ఇంజినీర్లు తిరుమ‌ల‌, జ‌య‌భార‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com