జంబలకిడి పంబ సినిమా అందరికీ తెలుసుకదండీ.. సీనియర్‌నరేష్, ఆమని జంటగా నటించిన చిత్రం. అందులో విచిత్రంగా ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలో ప్రవర్తిస్తారు. ప్రస్తుతం అదే సీన్ బయట కూడా రిపీట్ అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా…
మద్యానికి బానిసైన తమ ఆడవాళ్లు ఇంటిని గుల్ల చేస్తున్నారంటూ భర్తలందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో జరిగిందీ. గ్రామంలోని పురుషులందరూ నిన్న పోలీసులు, ఆబ్కారీ అధికారులను కలిసి తమ బాధను మొరపెట్టుకున్నారు.
గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు మాత్రం మద్యానికి బానిసై ఇల్లు గుల్ల చేస్తున్నారని, డబ్బులు మొత్తం మద్యానికే ధారబోస్తున్నారని వాపోయారు. ఇలాగైతే సంసారాలు గడవడం కష్టమని, పిల్లల బతుకు అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను, గ్రామాన్ని రక్షించాలని వేడుకున్నారు.